ఏడుగురు మావోయిస్టులపై ఎన్‌ఐఏ చార్జిషీట్‌

భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నమోదైన కేసులో ఏడుగురు మావోయిస్టులపై ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఐపీసీలోని 120బీ, 121 సెక్ష‌న్లు, ఉపాలోని 18,20,23,38,39, 40 సెక్ష‌న్లు, పేలుడు ప‌దార్థాల చ‌ట్టంలోని 4,5,6 సెక్ష‌న్లు, ఎక్స్‌ప్లోజివ్ యాక్టులోని 9బీ సెక్ష‌న్ల ప్ర‌కారం వారిపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో న‌లుగురిని అరెస్ట్ చేశారు. మ‌రో ముగ్గురు ప‌రారీలో ఉన్నారు.
 
ఏ1గా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మత్తు నాగరాజు, ఏ2గా మేడ్చల్‌ జిల్లాకు చెందిన కొమ్మరాజుల కనకయ్య, ఏ3గా జనగాం జిల్లాకు చెందిన సుర సారయ్య, ఏ4గా చత్తీస్‌గఢ్‌కు చెందిన గొరిల్లా మొదటి బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా పేరు పేర్కొన్నారు. ఏ5గా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొయ్యడ సాంబయ్య, ఏ6గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మదకం కోస్గి, ఏ7గా వరంగల్‌ అర్భన్‌ జిల్లాకు చెందిన వల్లెపు స్వామి పేర్లను చార్జిషీట్‌లో చేర్చింది. 
 
ఇంత‌కుముందు గ‌త ఫిబ్ర‌వ‌రి 18న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేష‌న్‌లో ఈ కేసు న‌మోదైంది. తాజాగా గ‌త మే రెండో తేదీన ఎన్ఐఏ తిరిగి ఈ కేసును రిజిస్ట‌ర్ చేసింది. ఇత‌ర కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మాద్వి హిద్మ‌, కొయ్యాడ సాంబ‌య్య‌, మ‌డ‌కం కోశి.. ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా యుద్ధం ప్ర‌క‌టించార‌ని అభియోగాలు న‌మోదు చేశారు.
భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై దాడుల‌తోపాటు తీవ్ర‌వాద కార్య‌క‌లాపాలు చేప‌ట్టేందుకు సిద్ధం అయ్యార‌ని పేర్కొన్నారు.
మావోయిస్టు అండర్‌గ్రౌండ్‌ సభ్యుల సహకారంతో మావోయిస్టు నాయకులు పెద్ద మొత్తంలో పేలుడుపదార్థాలు సమకూర్చి విధ్వంసానికి పథక రచన చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.