ఫడ్నవిస్ – మాలిక్ ల మధ్య పరువునష్టం దావాలు!

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తో మహారాష్ట్రలో చెలరేగిన రాజకీయ వివాదాలు మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫణవిస్, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్  మాలిక్ లమధ్య చోటుచేసుకున్న వాదోపవాదాలు చివరకు ఇద్దరు కుటుంభం సభ్యులు పరస్పరం పరువునష్టం దావాలు వేసుకోవడంకు దారితీస్తున్నాయి.

రూ 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ, మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ తనపై “పరువు నష్టం కలిగించే”, “తప్పుడు ఆరోపణలు” చేసినందుకు ఫడ్నవీస్‌కి లీగల్ నోటీసు పంపారు. నవంబర్ 1న, ఫడ్నవీస్ ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించి, “నవాబ్ మాలిక్ అల్లుడు డ్రగ్స్‌తో దొరికాడు’ అంటూ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, దానితో తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని నోటీసులో పేర్కొంది.

“ఆరోపణలు నిరాధారమైనవి, ఎటువంటి అర్హత లేనివి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మీరు చేసిన ఒక్క ఆరోపణకు కూడా మద్దతు ఇవ్వదు. జనవరి 14 నాటి పంచనామా ఆ ఇంటిని సోదాలు చేశామని, నా క్లయింట్ ఇంట్లో లేదా అతని ఆధీనంలో ఎటువంటి నిషిద్ధ వస్తువులు/అనుమానాస్పద పదార్థాలు కనుగొనలేదని స్పష్టంగా చెబుతోంది” అని లీగల్ నోటీసులో పేర్కొంది.

సమీర్ వాంఖడే నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త సమీర్ షబ్బీర్ ఖాన్‌ను మాలిక్ పెద్ద కుమార్తె నీలోఫర్ వివాహం చేసుకుంది. జనవరిలో, కరణ్ సజ్నాని అనే బ్రిటిష్ జాతీయుడిని ఎన్‌సిబి అరెస్టు చేయగా,  అతని నుండి దిగుమతి చేసుకున్న 75 కిలోల గంజాయి, 125 కిలోల గంజాయికి సంబంధించిన మెటీరియల్, అనేక గంజాయి మొగ్గలను స్వాధీనం చేసుకుంది. 

అతని విచారణ ఆధారంగా,  అతనికి, ఖాన్ మధ్య డబ్బు మార్పిడి జరిగినట్లు కనుగొన్నట్లు ఎన్ సి బి పేర్కొంది. దీని తరువాత, ఖాన్‌ను పిలిచి జనవరి 9 న అరెస్టు చేశారు. సెప్టెంబరులో ప్రత్యేక కోర్టు ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అతనిపై అక్రమ మాదకద్రవ్యాల రవాణా,  కుట్రకు ఎటువంటి కేసు లేదని పేర్కొంది.

మరోవైపు ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా మాలిక్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వ్యక్తితో ఉన్న అమృత ఫొటోను ఎన్సీపీ మంత్రి గతవారం బయట పెట్టారు.“మా క్లయింట్‌కి మాదకద్రవ్యాల వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని సూచించే విధంగా, తద్వారా పరువు నష్టం కలిగించే విధంగా, ముఖ్యంగా, జైదీప్ రాణాతో పాటు మా క్లయింట్  చిత్రాలు కూడా  పరువునష్టం కల్గించే  ట్వీట్‌లలో షేర్ చేశారు”. అని నోటీసు పేర్కొంది.

రానాను ‘రివర్ మార్చ్ ఎన్జీవో’ క్రియేటివ్ టీమ్ నియమించుకుందని, ఫడ్నవీస్‌కి అతనితో ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేశారు. అమృత ఫడ్నవీస్ ఎన్జీవో కోసం కేవలం ఒక పాట పాడి,  మ్యూజిక్ వీడియోను చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు. “ఈ నోటీసు అందిన 48 గంటల్లోపు మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పండి”  అంటూ  భవిష్యత్తులో పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయడం మానుకోవాలని మాలిక్ ను కోరారు. 

ఒకవేళ మాలిక్ నోటీసులో పేర్కొన్న వాటిని అనుసరించడంలో విఫలమైతే, ఫడ్నవిస్ “భారత శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 499,  500 కింద క్రిమినల్ ప్రొసీడింగ్‌లతో సహా వాటికి మాత్రమే పరిమితం కాకుండా తగిన ప్రొసీడింగ్‌లను తీసుకోవచ్చు” అని నోటీసు పేర్కొంది. మీపై పరువు నష్టం కోసం క్రిమినల్ ప్రొసీడింగ్స్ , సివిల్ దావా, ఖర్చులు,  పర్యవసానాలకు గురికావలసి ఉంటుందని స్పష్టం చేశారు. 

కాగా, ఇప్పటికే ఫడ్నవిస్, మాలిక్ మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీపావళి బాంబు పేలుస్తున్నానంటూ ఫడ్నవిస్ ఇటీవల నవాబ్‌మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దావూద్‌ గ్యాంగ్‌తో మాలిక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని  ఆరోపించారు.

ముంబై పేలుళ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్‌మాలిక్‌ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు. నవాబ్‌మాలిక్‌ దగ్గర ఉన్న ఆస్తుల్లో నాలుగు ఆస్తులు అండర్‌వాల్డ్‌తో లింక్‌ ఉన్నాయని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దీనికి ప్రతిగా నవాబ్ మాలిక్ ‘హైడ్రోజన్ బాంబు’ పేరుతో ఫడ్నివిస్‌పై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఫడ్నవిస్ హయాంలో ఆయన సహకారంతో మహారాష్ట్రలో నకలీ కరెన్సీ రాకెట్ నిరాఘాటంగా సాగిందని ఆరోపించారు.