బీఎస్‌ఎఫ్‌ పై పంజాబ్ తీర్మానం వ్యతిరేకించిన కెప్టెన్

బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్రం తీసుకువచ్చిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ తీసుకువచ్చిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర అధికారాన్ని ఉల్లంఘించదని  ఆయన స్పష్టం చేశారు. 

పొరుగున ఉన్న పాక్‌ అధునాత సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను వినియోగిస్తున్న క్రమంలో బీఎస్‌ఎఫ్‌ మరింత అధికార పరిధి పొందడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. బీఎస్ఎఫ్‌ సైతం పంజాబ్‌ పోలీసులవంటి వారేనని, మన భూమిని ఆక్రమించేందుకు వచ్చిన విదేశీ శక్తులు కాదని హితవు చెప్పారు. 

పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, అసోంలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో తనిఖీలు, స్వాధీనం చేసుకునేందుకు, అరెస్టులు చేపట్టేందుకు కేంద్రం గత నెలలో బీఎస్‌ఎఫ్‌ చట్టాన్ని సవరించింది. ఈ క్రమంలో పంజాబ్‌ అసెంబ్లీ గురువారం కేంద్రం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించింది. 

ఈ చర్య రాష్ట్ర పోలీసులను అవమానించడమేనని, వెంటనే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధి జాతీయ భద్రతకు సంబంధించిందని, రాష్ట్రంలోని శాంతిభద్రతలకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

వీటిని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. జాతీయ భద్రత అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆయన పంజాబ్ ప్రభుత్వానికి సూచించారు. అధికార పరిధి విస్తరణ పొడగింపు రాష్ట్ర సమాఖ్య అధికారాన్ని ఉల్లంఘించదని, శాంతిభద్రతల పర్యవేక్షణలో రాష్ట్ర పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించదని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు, దేశ భద్రతకు చాలా వ్యత్యాసం ఉందని, వీటిని కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.