హిందుత్వను ఐస్ తో పోల్చిన ఖుర్షీద్‌పై బీజేపీ ఫైర్

హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో పోల్చడంపై బీజేపీ మండిపడింది. ఇస్లామిక్ జీహాద్‌తో హిందుత్వను ముండిపెట్టడం వెనుక ముస్లిం ఓట్లకు గాలం వేసే ఆలోచన గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)కి ఉందని బీజేపీ సీనియర్ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తప్పుపట్టారు.

‘సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో హిందుత్వ కూడా ఐఎస్ఐఎస్, బోక్ హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లామిక్ గ్రూపుల వంటిదేనని రాశారు. సఫ్రాన్ టెర్రర్, ఇస్లామిక్ జీహాద్ ఒకటేననడం ముస్లిం ఓట్లను పొందేందుకు కాకపోతే మరింకెందుకని అనుకోగలం” అని మాలవీయ ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. 

బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, “ఇది కాంగ్రెస్ నిజమైన ఆలోచనను ప్రతిబింబిస్తుంది. వారు హిందువులతో కృత్రిమ సమానత్వాన్ని సృష్టించడం ద్వారా  ఐఎస్ఐఎస్   రాడికల్ అంశాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు”  అంటూ ధ్వజమెత్తారు.

ఈ విషయంపై సోనియా గాంధీ మౌనం వీడాలని, దీనిపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని భాటియా డిమాండ్ చేశారు. ఈ ఆలోచన శశి థరూర్‌దా, మణిశంకర్ అయ్యర్‌దా అనే ప్రశ్న తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ వీధుల్లో ఈ మాట చెప్పే ధైర్యం చేస్తుందా? అంటూ ఆయన సవాల్ చేశారు. 

స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత సహనం ప్రదర్శించిన 100 మంది హిందువులతో ఈ పోలిక పెట్టారని బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇది హిందువులను అవమానించడమే అని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే రాహుల్, ప్రియాంక హిందువులుగా మారతారని ఎద్దేవా చేశారు.

”సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్” అనే పేరుతో సల్మాన్ ఖాన్ రచించిన తాజా పుస్తకాన్ని ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోనే 113వ పేజీలో ఆయన హిందుత్వను ఐఎస్ఐఎస్‌, బొకో హరామ్‌తో పోల్చారు.

”సనాతన ధర్మం, సాధువులు, బుషులు చెప్పిన క్లాసికల్ హిందూయిజాన్ని… హిందుత్వ వెర్షన్ పక్కన పెట్టేసింది. హిందుత్వ రాజకీయ వెర్షన్ ప్రమాణాలు ఐఎస్ఐఎస్, బొకోహరాం రాజకీయ వెర్షన్‌‌ ప్రమాణాలకు సామీప్యం ఉంది” అని సల్మాన్ ఖుర్షీద్ అందులో పేర్కొన్నారు. కాగా, సల్మాన్ ఖుర్షీద్‌పై ఢిల్లీకి చెందిన వివేక్ గార్గ్ అనే న్యాయవాది క్రిమినల్ ఫిర్యాదు చేశారు. హిందుత్వను టెర్రరిజంతో పోల్చి అవమానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని గార్గ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.