హోమ్ మంత్రి సుచరిత భర్తకు కేంద్రం చెక్!

నిబంధనలకు విరుద్ధంగా ఆదాయపన్ను అధికారిగా పనిచేస్తున్న తన భర్త దయాసాగర్ ను  విజయవాడకు బదిలీ చేయించుకున్న ఏపీ హోమ్ మంత్రి మేకపాటి సుచరితకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
 
వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుతో పాటు ఒక బిజెపి ఎంపీ కూడా ఈ అంశాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ల దృష్టికి తీసుకు రావడంతో ఆ బదిలీ ఆగిపోయింది. భర్త దయాసాగర్‌ ఆదాయపన్ను శాఖలో ఉన్నతాధికారిగా గతంలో ముంబై, హైదరాబాద్, మధ్యప్రదేశ్ లలో పని చేసారు.
1992వ సంవత్సరం ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి అయినా ఆయన భార్య ఏపీ హోమ్ మంత్రి కావడంతో, పలుకుబడి ఉపయోగించుకొని విజయవాడకు ఆదాయపన్ను శాఖ కమీషనర్ గా అక్టోబర్ 27న బదిలీపై పదవీ బాధ్యతలు స్వీకరించారు.  దానితో ఒక రాష్ట్ర హోంమంత్రిగా తన భార్య ఉన్నా కూడా, భర్తని అదే రాష్ట్రంలో వేయటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
 
దీనికి తోడు ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటంపై విమర్శలు వచ్చాయి. ఆయన అక్కడ పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతిస్తూ ఏపీ హోమ్ శాఖ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.  వీటిని నేరుగా దృష్టికి తీసుకు రావడంతో ఆ సంబరాలు ఎక్కువకాలం నిలబడలేదు.

పైగా, ఆయన బాధ్యతలు తీసుకునే సమయంలో, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా ఢిల్లీకి చేరడంతో కేంద్రం తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. దానితో పది రోజులకే దయాసాగర్‌ ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీ చేశారు. ఆయన ఎంత వేగంతో విజయవాడ వచ్చారో, అంతే వేగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ వెళ్ళిపోయారు.