అనంతపురంలో రెండో రోజు విద్యార్థుల ఆందోళన

అనంతపూర్ లో  ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విలీనంకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రమవుతున్నది. రెండో రోజు కూడా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకు దిగిన పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని రెండో టౌన్‌ పీఎస్‌కు తరలించారు. 

ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయవద్దని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

 ఎస్పీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను సప్తగిరి సర్కిల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. 

 ఎయిడెడ్‌ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టిన  విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నంలో సోమవారం పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆగ్ర‌హించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇటీవ‌ల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్లలు త‌మ స్కూల్‌ను విలీనం చేయ‌వ‌ద్దని ఆందోళ‌న చేపట్టారు. తాజ‌గా అనంత‌పురంలోని సాయిబాబా నేష‌న‌ల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. త‌మ క‌ళాశాల‌ను విలీనం చేసేందుకు యాజ‌మాన్యం అంగీక‌రించ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న చేశారు.

ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సెప్టెంబర్ 24న ఎయిడెడ్ కాలేజీలు తమ ఎయిడెడ్ పోస్టులను సరెండర్ చేసి గుర్తింపు రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలుగా కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మరోవంక, విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతుండగా  విద్యార్థులు చొచ్చుకువచ్చి మంత్రిని ఘెరావ్‌ చేశారు. అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని ఖండించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. 

విద్యార్థులకు నచ్చజెప్పేందుకు మంత్రి ప్రయత్నించినప్పటికీ విద్యార్థి నేతలు వినిపించుకోలేదు. ప్రెస్‌మీట్‌ను మంత్రి నిలుపుదల చేసి వెళ్లిపోయారు. మంత్రిని వెళ్లనీయకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీ పోలీసులు రంగప్రవేశం చేసి మంత్రిని క్షేమంగా బయటకు పంపారు.