ఏపీ, ఒడిశా వివాదాలపై ప్రధాన కార్యదర్శులతో కమిటీ 

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చర్చల అనంతరం  రెండు రాష్ట్రాల ముఖ్యమంతృలు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం భువనేశ్వర్ కు వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై  చర్చలు జరిపారు.  ఉభయ రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే లక్ష్యంగా సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా నలుగుతున్న వంశధార, జంఝావతి జల వివాదాలు, సరిహద్దు సమస్య,  బలిమెల, అప్పర్‌ సీలేరులో జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్‌వోసీలు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి.

మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు గంజాయి సాగు, అక్రమ రవాణాను నివారించేందుకు సమష్టిగా కృషి చేయాలని నిశ్చయించారు. ఒడిశా సచివాలయమైన లోక్‌సేవా భవన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ ఎదురేగి  పుష్ఫగుచ్చం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు.

 రెండు రాష్ట్రాల సీఎంలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రెవెన్యూ, జలవనరులు, ఇంధన తదితర శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని చెప్పారు.

మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపై సహకారాన్ని కొనసాగిస్తూ కలసికట్టుగా ఎదుర్కొంటామని ఇద్దరు సీఎంలు తెలిపారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంశాల పరిష్కారంలో అడుగు ముందుకేసినట్లు ప్రకటించారు.