ఫరూఖీ షో కు హిందూ సంస్థల నిరసనలు

స్టాండప్‌-కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీ షోకు అనుమతినిచ్చేటట్లయితే నిరసనలు చేపడతామని రాయపూర్‌ యంత్రాంగాన్ని హిందూత్వ సంఘాలు హెచ్చరించాయి. ఈ షో నవంబర్‌ 14న చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో జరగాల్సి ఉంది. ఈ షోను రద్దు చేయనట్లయితే తాము నిలిపివేస్తామని విశ్వ హిందూ పరిషత్‌తో పాటు పలు హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. 
 
ఈ షోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ సభ్యులు ఆందోళన జరిపారు.  ‘ఫరూఖీ గతంలో మా దేవుడ్ని కించపరిచాడు. ఇటువంటి హిందూ వ్యతిరేకికి రాజధానిలో వచ్చేందుకు అనుమతి లేదు. ఒకవేళ యంత్రాంగం అనుమతినిస్తే.. మా దారిలో మేము ఈ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తాం. దీనికి యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని విహెచ్‌పి నేత సంతోష్‌ చౌదరి హెచ్చరించారు. 
 
ఈ షో ప్రోగ్రామ్‌ నిర్వహకులు ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. షో అనుమతి కోసం అప్లికేషన్‌ ప్రాసెస్‌లో ఉందని, ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న ఈ షోకు భద్రత కల్పించాలని నిర్వాహకులు కోరారని, పోలీసు అప్రూవల్‌ కోసం అప్లికేషన్‌ను పంపినట్లు రారుపూర్‌ కలెక్టర్‌ సౌరభ్‌ కుమార్‌ చెప్పారు. 
 
గత నెలలో కూడా రెండు సార్లు ఫరూఖీ ప్రోగ్రామ్‌లు ఇలాంటి బెదిరింపుల కారణంగానే నిలిచిపోయాయి. ముంబైలో మూడు రోజులపాటు జరుగవలసిన షో లను విశ్వహిందూ పరిషద్ హెచ్చరికలతో రద్దుచేసుకున్నారు. ఇటువంటి షోల పేరుతో హిందూ ధర్మంను, హిందువుల విశ్వాసాలను అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంటే హిందూ సమాజం మౌనంగా ఉండజాలబోదని స్పష్టం చేశారు.