తమిళనాడులో భారీ వర్షాలు.. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం కాగా.. మరో 15 జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరోవైపు కొత్తగా ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలుంటాయ‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొన్న శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నదులు , వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్య్యాయి.

చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఫలితంగా చెన్నై సహా 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం.

చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకొట్టై, తిరువారూర్, తేన్ కాశీ, తిరునల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో వర్షాలు పొంచి ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.

ఈ నేపధ్యంలో చెన్నై నగరంలో మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా.. కన్యాకుమారి, చెన్నై ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

 భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  2015 అనంతరం భారీ వరదలు చెన్నైను ముంచెత్తాయని,చెన్నైతో పాటు శివారు ప్రాంతాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం 5.30 వరకు నగరంలో 14.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు