పెట్రోల్ పై వ్యాట్‌ను తగ్గించేది లేదు.. జగన్ స్పష్టం

పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడం ద్వారా మరింతగా ధరలు తగ్గేందుకు దోహదపడగా,  తాము మాత్రం వ్యాట్ తగ్గించేది లేదని అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

పెట్రోలు డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు అనుగుణంగా వ్యాట్‌లో కోతకు దిగే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పింది.  పైగా వ్యాట్‌ను తగ్గించకపోవడానికి కారణాలను, తమ రాష్ట్ర వైఖరిని సమర్థించుకుంటూ పత్రికలలో పూర్తి స్థాయిలో ఒక పేజీ వివరణాత్మక ప్రకటనను కోట్ల రూపాయలు వెచ్చించి వెలువరించింది.

 పన్నుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఇదేనని, ప్రజులు దీనిని గుర్తించి, అర్థం చేసుకోవాలని ఇందులో సిఎం జగన్ విజ్ఞప్తి చేసుకున్నారు. కేంద్రం పన్నులు తగ్గిస్తే రాష్ట్రం ఎందుకు కిమ్మనకుండా ఉందని, వెంటనే కుదించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పత్రికలకు ఈ ప్రకటన వెలువరించింది. 

సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కోటాలో రాష్ట్రం ఇప్పటికే రూ 3.35 లక్షల కోట్లు వసూలు చేసి పెట్టిందని, మరి దీనికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రానికి ఎందుకు తగు వాటా అందించడం లేదని అంటూ కేంద్రంపై ఎదురుదాడికి దిగారు.  అయితే  కేంద్రం ఇంధన ధర లు పెంచిన ప్రతిసారీ అధిక వ్యాట్‌ కారణంగా రాష్ట్రానికి భారీగానే ఆదాయం వస్తోంది. మరి కేంద్రం ధరలు తగ్గించినప్పుడు జగన్‌ సర్కారు కూడా తగ్గించాలి కదా!  

తమ హయాంలో ఒక్కసారే పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచామని జగన్‌ ప్రభుత్వం కొన్ని పత్రికలకు మాత్రమే ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా.. 2015 ఫిబ్రవరి 5వ తేదీకి ముందు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ ఉందని పేర్కొంది. 

2015 నుంచి నిరుడు సెప్టెంబరు 19 వరకు అదే వ్యాట్‌ కొనసాగిందని.. పైగా ఆ కాలంలో రూ.4 అదనపు వ్యాట్‌ ఉందని.. తాము వచ్చాక అదనంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క రూపాయి సెస్సు మాత్రమే విధించామని తెలిపింది. 2015 నుంచి నేటి వరకు అదనపు వ్యాట్‌ 4 రూపాయలే కొనసాగుతోందని, తాము అదనంగా పెంచిదేమీలేదని వాదించింది. 

కాగా, తెలుగుదేశం ప్రభుత్వం 2018 సెప్టెంబరు 10న పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ తగ్గించింది. అంటే ఇక మిగిలిన అదనపు వ్యాట్‌ రెండ్రూపాయలే. కానీ 2020 జనవరి నుంచి జూలై వరకు కేవలం 7 నెలల వ్యవధిలోనే జగన్‌ సర్కారు అదనపు వ్యాట్‌ పెంచింది. రూ.2 నుంచి 4కు తీసుకొచ్చింది. దీనికితోడు రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై రూపాయి సెస్సు వేస్తోంది. అంటే వ్యాట్‌, సెస్సు పేరిట రూ.3 భారం వేసింది

వాస్తవానికి,  అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తర్వాత మూడుసార్లు పన్నుల భారం మోపారు. టీడీపీ తగ్గించిన అదనపు వ్యాట్‌ను 7నెలల్లో పెంచేశారు. ఇది సరిపోదన్నట్లు రోడ్ల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై లీటరు కు రూ.1 చొప్పున సెస్సు వేశారు. 

ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో వ్యాట్‌ వడ్డింపు చాలా ఎక్కువగానే ఉంది. నిరుడు జూలై 20న లీటర్‌ పెట్రోల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.2.76 నుంచి 4 రూపాయలకు, డీజిల్‌పై ఉన్న అదనపు వ్యాట్‌ 3.07 నుంచి 4 రూపాయలకు పెం చారు. అంటే పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల భారం వేస్తూ జీవో 204ని జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోలు, డీజిల్‌పై వసూలు చేసిన రూపాయి సెస్సులో 50 పైసలను తాకట్టుపెట్టి మరీ రుణం తీసుకొస్తున్నారు. కానీ, ఆ పేరుతో వసూలు చేసిన సెస్ రూ.2,205 కోట్లు మాత్రం అందుకోసం ఖర్చు చేయడం లేదు. 

ఇలా ఉండగా, పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. 

అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని బిజెపి నేత  ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ. 2 వసూలు చేస్తూ గోతులు ఎందుకు పూడ్చడం లేదని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.