రెండో వారంలోకి అమరావతి రైతుల పాదయాత్ర 

అమరావతి రాజధాని కోసం నడుం బిగించిన రైతుల మహా పాదయాత్ర వారం రోజులు ముగించుకొని, నేడు రెండో వారంలోకి ప్రవేశించింది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు. కరోనా నిబంధనలు, ట్రాఫిక్‌ సమస్య పేరుతో ఆటంకాలు…. వీటన్నింటినీ అధిగమిస్తూ సాగుతున్నది. 

సంవత్సరంకు పైగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ ఉద్యమం ఈ పాదయాత్రతో గ్రామసీమలలో ప్రజల మద్దతును సమీకరించుకొంటూ, ప్రజా  ఉద్యమంగా రూపాంతరం చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆధార వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతూ యాత్రలో అక్కడక్కడా పాల్గొంటున్నారు. 

తమకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా తరలి వస్తున్న ప్రజానీకం ఆశీస్సులు స్వీకరిస్తూ  అమరావతి రైతుల మహాపాదయాత్ర ఐదురోజుల పాటు గుంటూరు జిల్లాలో తిరిగి,  ప్రకాశం జిల్లాలో శనివారం ప్రవేశించింది. 

ఆదివారం ఉదయం 8 గంటలకు పర్చూరు నుంచి పాదయాత్ర ప్రారంభమై, దాదాపు 17 కిలోమీటర్ల మేర కొనసాగి ఇంకొల్లులో ముగిసింది. కార్తీక సోమవారం సందర్భంగా నేడు పాదయాత్రకు విరామం ఇచ్చారు. మంగళవారం యథావిధిగా కొనసాగనున్నది.. ఇప్పటి వరకూ అమరావతి రైతుల బృందం ఏడు రోజుల పాటు 96.3 కిలోమీటర్ల మేర నడిచి ఇంకొల్లుకు చేరుకుంది. 

ఇదిలా ఉండగా, పాదయాత్ర సాగుతున్న తీరుపై పోలీసులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులను పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో మోహరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర సాగుతున్నదని జేఏసీ నాయకులు పోలీసులకు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు.

‘న్యాయస్థానం నుంచి దేవస్థాననం’ మహా పాదయాత్ర ప్రకారం  జిల్లాలో 12 రోజులపాటు కొనసాగనున్నది. మార్గం మధ్యలో విశ్రాంతి కోసం రెండు రోజులు ఆగనున్నారు. జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగనున్నది. 19 వ తేదీన నెల్లూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది

వేలాదిగా చేరిన రైతులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా నిలిచి ‘జై అమరావతి  అని నినదిస్తూ ప్రతి చోటా సంఘీభావం తెలుపుతున్నారు. మార్గమధ్యంలో పూలజల్లులు, మంగళహారతులు, మేళతాళాలతో నీరాజనాలు పట్టారు. పలుచోట్ల పొలాల్లో పనిచేసుకొనే కూలీలు సైతం రోడ్డుపైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. 

 మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు వీల్‌చైర్‌లో కూర్చొని యాత్రలో పాల్గొన్న పాదయాత్ర బృందంలో స్ఫూర్తిని నింపారు. బీజేపీ నేత, పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం,  కృష్ణాజిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యేలు అరిమిల్ల రామకృష్ణ, వంగవీటి రాధ, ముళ్లపూడి బాపిరాజు తదితరులు పాదయాత్రలో పాల్గొని, సంపూర్ణ మద్దతు తెలిపారు.

 పర్చూరు నుంచి నూతలపాడు వైపు యాత్ర సాగుతున్న సమయంలో నిబంధనల పేరుతో పాదయాత్ర బృందాన్ని అనుసరిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బృందం సభ్యులు, ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మహిళలు, జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడటంతో యాత్రను ముందుకు వెళ్లనిచ్చారు. 

మార్గమధ్యంలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసుల తీరుపై అమరావతి జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నా ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి యాత్రను ఆపాలని పోలీసులు చూస్తున్నారని జేఏసీ నేత రాయపాటి శైలజ ధ్వజమెత్తారు.

 ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ప్రత్యేక రథం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మహిళలు పూజలు నిర్వహించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మారి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా బుద్దిని ప్రసాదించాలని ప్రార్ధించించినట్లు మహిళలు వెల్లడించారు. 

అయితే   యాత్రకు పోలీసులు ఎక్కడా అడ్డంకులు సృష్టించడం లేదని  ఎస్పీ మలికగర్గ్‌   స్పష్టం చేశారు. పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని,  హైకోర్టు విధించిన షరతులకు భిన్నంగా యాత్ర సాగుతోందని ఆమె ఆరోపించారు. మరోవంక, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతంలో అమరావతి రైతుల మహాపాదయాత్రను నిలుపుదల చేయాలని సంతనూతలపాడు వైసిపి  ఎమ్మెల్యే సుధాకర్‌బాబు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌కు ఫిర్యాదు చేశారు.