ఐపీఎల్‌ ఆటలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ముప్పు!

ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిల్యాండ్ జట్టు ఘనవిజయం తర్వాత ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ చేరే దారులు పూర్తిగా మూసుకుపోవడంతో భారత దేశంలోని క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ముఖ్యంగా తొలి ఆటలోనే దాయాది పాకిస్థాన్ జట్టుతో, ఆ తర్వాత న్యూజీలాండ్ జట్టుతో అత్యంత పేలవంగా ఆడటంతో ఇప్పటికే స్వదేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
‘ఆటగాళ్లు భారత జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్‌లో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే.. వారికి మనమేం చెప్పగలం?’ అంటూ  టీ20 ప్రపంచకప్ నుంచి భారత్‌ నిష్క్రమించడంపై స్పందిస్తూ మొదటిసారి భారత్ కు ప్రపంచ కప్ గెల్చుకున్న ప్రముఖ క్రీడాకారుడు కపిల్ దేవ్ ఎద్దేవా చేశారు. ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని విస్మరించే వాళ్లకు ఏం చెప్పలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్లు దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలంటూ హితవు పలికాడు. టీమిండియాకు ఆడాలనుకునేవాళ్లు ఐపీఎల్‌ లాంటి టోర్నీలు ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. 
ఐపీఎల్‌కి, టీ20 ప్రపంచకప్‌కి కొంచెం వ్యవధి ఉండి ఉంటే టీమ్‌ఇండియా పరిస్థితి మరోలా ఉండేదేమోనని కపిల్ దేవ్ పేర్కొన్నారు. అందుకే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. ప్రస్తుత క్రీడాకారుల ఆర్థిక పరిస్థితుల గురించి తనకు తెలియదు ఆంటూనే ఆటలో ప్రావిణ్యం చూపడంపై కన్నా సంపాదనపై దృష్టి మళ్లుతున్నదనే విధంగా చురకలు అంటించారు.
 
దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లంతా గౌరవంగా భావించాలని పేర్కొంటూ  “నేనైతే టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకే మొదటి ప్రాధాన్యమిస్తాను. ఆ తర్వాతే ఏదైనా” అంటూ సున్నితంగా విమర్శలు గుప్పించారు. అయితే ఐపీఎల్‌లో ఆడొద్దని తాను చెప్పనని, ఐపీఎల్ వల్లే చాలామందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. 
 
కానీ, దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, మ్యాచ్‌ల షెడ్యూలింగ్ విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు చెప్పారు. టీమ్‌ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాలని సూచించారు.
 
టీ20 ప్రపంచకప్ నుంచి భారత్‌ నిష్క్రమించడం బాధాకరమే. అయినా, ఇప్పటికీ మించిపోయిందేం లేదని చెప్పుకొచ్చారు.  
రానున్న ప్రపంచకప్‌ కోసం మరింత మెరుగ్గా తయారవ్వాలని కపిల్ దేవ్ భారత ఆటగాళ్లకు సూచించారు.  2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా వెనుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది ఒకటని  మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.  తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ టాస్ ఓడిన మాట నిజమేనన్న ఆయన, కేవలం టాస్‌ ఓడితేనే మ్యాచ్‌లు ఓడిపోతారా? అని ప్రశ్నించాడు. షార్జాలో ఇంగ్లండ్‌పై టాస్‌ ఓడినా కూడా సౌతాఫ్రికా గెలవలేదా?  అని గుర్తు చేశారు. 
 
ఓడిన రెండు మ్యాచుల్లో మంచు కారణంగా భారత బౌలర్లు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని, కానీ ఆ మ్యాచుల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడమే అసలు సమస్య అని చోప్రా స్పష్టం చేశారు. బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్లు చేసి ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి ఉండేదని తెలిపారు. 
 
2007 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఒకటి రెండు సార్లు టీమిండియా సెమీస్‌ వరకూ వెళ్లలేదని, కానీ గడిచిన 7-8 సంవత్సరాల్లో ఎప్పుడూ అలా జరగలేదని గుర్తుచేశాడు. అలాంటిది ఇప్పుడు సెమీస్‌ చేరకుండా వెనుతిరగడం టీమిండియా జట్టును చాలా బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.