ఘనంగా పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేశారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు.

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మ భూషన్‌, బాలీవుడ్‌ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్‌, క్రీడాకారుడు జహీర్‌ ఖాన్‌, సింగర్‌ అద్నాన్‌ సమీలకు పద్మశ్రీ, నిర్మాత కరణ్‌ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. 

మరణానంతరం అరుణ్‌ జైట్లీకి పద్మ విభూషన్‌, సుష్మా స్వరాజ్‌, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్‌ ప్రకటించారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డును ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ అందుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు.  తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

కాగా, శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన. ప్రముఖ రంగస్థల సినీయర్‌ నటులు యడ్ల గోపాలరావు కూడా భారత రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డును  అందుకున్నారు. పద్మశ్రీ అవార్డుకు యడ్ల గోపాలరావు ఏడాదిన్నర క్రితమే ఎంపికయినా, కరోనా  కారణంగా కొంత విరామం తర్వాత ఈరోజు అవార్డును అందుకున్నారు.

ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్రమంత్రి అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.