సామాన్య ప్రజలకు `విశ్వాస వారధి’గా  బిజెపి కార్యకర్తలు 

బిజెపి కార్యకర్తలు పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య `విశ్వాసం నింపే వారధి’గా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.  కరోనా మహమ్మారి అనంతరం జరిగిన పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ దేశంలోని సామాన్యులకు దగ్గరైన సమస్యలతో నిత్యం ముడిపడి ఉన్న పార్టీ చరిత్రను ప్రస్తావించారు. 

ఏ ఒక్క కుటుంబం చుట్టూ కేంద్రీకృతం కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేయడం వల్లే పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉందని మోదీ తెలిపారు. హామీలను నెరవేర్చడంలో, ప్రజల కోసం అంకితభావంతో పనిచేయడంలో పార్టీ విలువలు దృఢంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు.

‘‘సామాన్యులతో ఎప్పుడూ అనుబంధం ఉండడం వల్లనే పార్టీ ఈ స్థితికి చేరుకుంది. బీజేపీ ఏ కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై లేదు. దాని విలువలు ‘సేవ, సంకల్ప్, సమర్పన్’ (సేవ,  సంకల్పం,  నిబద్ధత)’’ అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచం నేడు భారత్‌ను ప్రశంసిస్తోందని ప్రధాని మోదీ గుర్తు చేస్తూ. ఇది మోదీ అనే వ్యక్తి వల్ల కాదని, ప్రజల అభీష్టం, విశ్వాసం, తమపై తమకున్న విశ్వాసం వల్లనే అని స్పష్టం చేశారు. 

. సామాన్యుడి సమస్యలను అతి దగ్గరి నుంచి ఆకళింపు చేసుకునే అవకాశం, శక్తి పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలకు ఉంటుందని, ఈ క్రమంలో వారే పార్టీకి, ప్రజలకు మధ్య వారధి అవుతారని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం దిశలోనే పురోగమించడమే పార్టీ చరిత్రగా నిలిచిందని చెప్పారు. సమిష్టితత్వాన్ని నమ్ముకున్న పార్టీ ఎప్పుడూ వాస్తవికతలనే గ్రహిస్తుంది. వాటినే ఆచరిస్తుందని తెలిపారు.

పార్టీ కోసం తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలకు నివాళులు అర్పించేందుకు ‘నమో యాప్‌’లో ‘కమల్‌ పుష్ప్‌’ పేరిట కొత్త విభాగం ప్రారంభించిన విషయాన్ని వివరించారు. మొదటి నుంచీ పార్టీలో ఉన్న వారిని గౌరవించాలని, కొందరు వెళ్లిపోయినా.. వారి పనిని మాత్రం గుర్తించాలని సూచించారు.

పార్టీ ప్రారంభం నుండి పనిచేసిన వారిని, వారు ఇప్పుడు పార్టీని విడిచినా వారిని గౌరవించవలసిన అవసరం ఉన్నదని ప్రధాని చెప్పారు. వారిప్పుడు పార్టీలో లేకపోయినా వారి కృషి పార్టీ ఎదుగుదలకు దోహదపడడాన్ని మనం ఎప్పటికి మరువలేమని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో బిజెపి కార్యకర్తలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, అధికార పార్టీ ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు

తెలంగాణలో ప్రజలు మార్పును కోరుతున్నారని, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రధాన మంత్రి చెప్పారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘‘2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి హుజూరాబాద్‌లో 2 వేల కంటే తక్కువ ఓట్లు లభించాయి. ఇప్పుడు.. లక్షకుపైగా ఓట్లతో ఘన విజయం సాధించింది. దేశంలో ప్రజలు మార్పులను కోరుతున్నారనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణలోనే కాకుండా.. అన్ని చోట్లా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు’’ అని తెలిపారు.

తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రజెంటేషన్‌ల గురించి మోదీ మాట్లాడుతూ, “ప్రజలకు దగ్గరగా ఉన్న సమస్యలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నందున పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందని” విశ్వాసం వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌లలో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి అధ్యక్షులు సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రజెంటేషన్ ఇచ్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విలేకరులకు తెలిపారు.  ఇదే విధమైన ప్రజెంటేషన్‌ను బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు కూడా  అందించారని ఆయన చెప్పారు.నమో యాప్‌లో ప్రారంభించిన కమల్ పుష్ప్ కొత్త చొరవ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. తమ జీవితాంతం పార్టీ కోసం అంకితం చేసిన కార్యకర్తలకు నివాళులు అర్పించారు.

.