మోదీకి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు

భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు ప్రధాని మోదీ కష్టించి పనిచేస్తుంటే.. దానిని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నట్లు ఆమె తెలిపారు. 

 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బిజెపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ  ‘‘ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూల అభిప్రాయం నెలకొందని.. వారు ఉత్సాహంతో పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ తీర్మానం తెలిపింది. ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలను తీవ్రంగా ఖండించింది. కరోనా సమయంలో ప్రజల్లోకి వెళ్లకుండా ట్విటర్‌ ద్వారా అయోమయం సృష్టించాయని విమర్శించింది” అని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రపంచమంతా భారత్‌ను కొనియాడుతుంటే.. ప్రతిపక్షాలు మొదటి నుంచీ దానిపై సందేహాలు లేవనెత్తుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ప్రజలకు నిర్దిష్ట పద్ధతిలో వంద కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందించామని చెబుతూ వ్యాక్సినేషన్‌కు, దేశంలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల మెరుగుదలకు బడ్జెట్‌లో రూ.36 వేల కోట్లు కేటాయించామని ఆమె గుర్తు చేశారు. 

మహిళా నేతృత్వంలోని అభివృద్ధే తమ నినాదం అని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ గురించి ప్రస్తావించారు. మన దేశ జాగ్రత్తగా కాపాడుకుంటూ మేము 8 నెలల పాటు 80 కోట్ల మందికి ఆహారం ఇచ్చా”మని,  ఒకే దేశం, ఒక రేషన్ కార్డు” జారీ చేశామని ఆమె వివరించారు.

రక్షణ, సైన్యంలో మహిళల ప్రవేశం, సైనిక స్కూళ్ల ఏర్పాటు గురించి రాజకీయ తీర్మానంలో వివరించామని తెలిపారు. గ్లాస్గో సమావేశంలో వాతావరణ మార్పులపై భారత్‌ అవలంబించిన వైఖరి, అవినీతి రహిత ప్రభుత్వం నెలకొల్పడం, జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంతో పాటు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను తీర్మానం ప్రశంసించిందని ఆమె వివరించారు. 

కాగా,  సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌  రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారని, రైతులు ఒక్క అభ్యంతరం కూడా వెల్లడించలేకపోయారని ఆమె గుర్తు చేశారు. కానీ  ప్రతిపక్షాలు ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తున్నాయని నిర్మల విమర్శించారు.

అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తున్నామని, డిజిటల్ ఇండియా ద్వారా “పారదర్శకత”ను తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. “భారతదేశంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ ఇండియా మిషన్ వాటిని వేగవంతం చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మిషన్ సహాయంతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ దేశాన్ని బలోపేతం చేస్తుంది” అని ఆర్ధిక వివరించారు.