
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
కరోనా అనంతర పరిస్థితుల్లో గ్రామాలకు యువత వలసబాట పడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని చెప్పారు. బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలను బహూకరించారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీఓ) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని, అందుకే ఎఫ్‌పీఓల సామర్థ్య నిర్మాణం అవసరమని.. ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
వ్యవసాయంతో పాటు ఆహారోత్పత్తుల నిర్వహణ తదితర అంశాల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహార భద్రతను సుస్థిరం చేసే దిశగా మరో అడుగు ముందు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులందరూ తమ భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఉపరాష్ట్రపతి శుభాశీస్సులు అందజేశారు.
చంపారన్‌లో రైతు కేంద్రిత సంస్థల ఏర్పాటులో చొరవతీసుకున్న పార్లమెంటు సభ్యుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి రాధామోహన్ సింగ్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బిహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అమరేంద్ర సింగ్‌తోపాటు, విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ ప్రఫుల్ల్ కుమార్, పాల్గొన్నారు.
అంతకుముందు నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన 6వ అంతర్జాతీయ ధర్మ-ధమ్మ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నలంద విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సునయన సింగ్, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లు శ్రీమతి లలిత కుమారమంగళం, ధృవ్ కటోచ్‌తో పాటు హిందు, బౌద్ధ ధర్మాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ