ఒక్కటొక్కటిగా దెబ్బతింటున్న చైనా ఆర్ధిక మూలాలు

చైనా ఆర్థిక మూలాలు ఒక్కటొక్కటిగా దెబ్బతింటున్నాయి. ముంచుకొచ్చిన వరదలు, ఆహార సంక్షోభం, ఇతర దేవాలు చైనాపై విధించిన ఆర్థికపరమైన ఆంక్షలు, పేట్రేగి పోతున్న కరోనా మహమ్మారికి తోడు రియల్టీ రంగంలో తలెత్తిన పంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది.

దేశం జిడిపిలో 29 శాతంగా ఉన్న రియల్టీ రంగం కుదేలవుతోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్‌రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఎవర్ గ్రాండ్ డిఫాల్టర్ జాబితాలో చేరింది. తాజాగా మరో రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ కైసా గ్రూపు కూడా డిఫాల్టర్‌గా మిగిలిపోనున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ తాజా పరిణామాలతో చైనా పునాదులు కదిలిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతుంటే రియల్టీ రంగంలో ఒడిదుడుకులు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. షెన్‌జెన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కైసా గ్రూపు షేర్లను హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. అంతేకాదు కైసాకు అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించే ట్రేడింగ్ కూడా నిలిచిపోయినట్లు సిఎన్‌ఎన్ తెలిపింది.

కైసా సస్పెన్షన్‌కు కారణాలేమిటో బహిర్గతం చేయకపోయినా.. ఆ కంపెనీకి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ ఆర్థిక రంగానికి చెందిన మీడియా సంస్థ సెక్యూరిటీ టైమ్స్ ఆ సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని , బకాయిలు చెల్లించలేక పోతోందంటూ కథనాలు ప్రచురించింది. 

అయితే కైసా మాత్రం రియల్టీ రంగంపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. మరో రియల్టీ సంస్థ మోడరన్‌ల్యాండ్ సైతం అప్పులు చెల్లించలేక అవస్థలు పడుతోంది.

ఇటీవల చైనా రియల్టీ రంగంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన డెవలపర్లు కంపెనీపై బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాయి. అయితే మోడరన్ ల్యాండ్ ప్రతినిధులు తమకు బకాయి లు చెల్లించేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. కోరిన గడువులోగా బకాయిలు చెల్లించక పోతే ఆ సంస్థ కూడా డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉంటుంది.