జైలులో పాణాపాయంలో చైనా జర్నలిస్ట్!

చైనాలో కరోనా మూలాల గురించి తన స్మార్ట్ ఫోన్ లో వీడియోల ద్వారా మొదటగా ప్రపంచానికి తెలియచెప్పిన జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్ (38) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆమె ఓ మాజీ న్యాయవాది కూడా. వ్యాధి ప్రబలిన తీరు, దానిని నియంత్రిస్తున్న తీరుపై ఆమె చైనా అధికారులను తన స్మార్ట్‌ఫోన్ వీడియోల ద్వారా ప్రశ్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ట్లు ఆమె సోద‌రుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వుహాన్‌లో కరోనా  విజృంభించిన స‌మ‌యంలో.. అక్క‌డ జ‌రిగిన సంఘ‌ట‌న‌ల గురించి జాంగ్ రిపోర్టింగ్ చేశారు. 2020 ఫిబ్ర‌వ‌రిలో ఆమె వుహాన్‌కు వెళ్లి అక్క‌డ క‌థ‌నాలు రాశారు. స్మార్ట్‌ఫోన్ వీడియోల ద్వారా మ‌హ‌మ్మారిపై అధికారుల్ని నిల‌దీశారు.

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది మేలో ఆమెను అరెస్టు చేశారు. డిసెంబ‌ర్‌లో ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష‌ను విధించారు. వీడియోల‌తో ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొడుతున్న ఆరోప‌ణ‌ల కింద ఆమెను అరెస్టు చేశారు. అయితే ప్ర‌స్తుతం జాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని, బ‌రువు కోల్పోయింద‌ని, ఇక ఆమె చాన్నాళ్లు బ్ర‌త‌క‌లేద‌ని సోద‌రుడు జాంగ్ జూ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

జైలులో ఉన్న జాంగ్‌.. నిరాహార దీక్ష చేస్తోంది. ముక్కు ద్వారా ఆమెకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. రాబోయే శీతాకాలంలో ఆమె ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉన్న‌ట్లు జాంగ్ సోద‌రుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న సోద‌రిని రిలీజ్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ను ఆమె సోదరుడు వేడుకున్నారు.

షాంఘై మ‌హిళా జైలులో ఉన్న ఆమెను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా  అధికారుల అనుమ‌తి ద‌క్క‌డం లేదు. వుహాన్‌లో కరోనా రిపోర్టింగ్ చేసిన‌వారిలో జాంగ్‌తో పాటు చెన్ ఖుషి, ఫాంగ్ బిన్‌, లీ జిహువాలు ఉన్నారు. అంద‌ర్నీ అక్క‌డి ప్ర‌భుత్వం అరెస్టు చేసింది.  ఆమెను వెంటనే విడుదల చేయించే ప్రయత్నం చేయాలని ఆమె కుటుంబసభ్యులు ప్రపంచంలోని మానవ హక్కు కార్యకర్తలకు విన్నవించుకుంటున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందన్నది ఆమె న్యాయవాదుల బృందానికి కూడా తెలియడంలేదు.