
ఈ నెల 8 నుంచి అమెరికా తమదేశంలో అన్ని రకాల ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనుంది. పూర్తి స్థాయిలో అంటే రెండు డోసుల వ్యాక్సిన్లు పొందిన విదేశీ జాతీయులందరి ప్రవేశానికి దేశంలో అనుమతి ఉంటుందని తాజా అధికారిక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి, వివిధ దేశాలలో రకరకాల వేరియంట్ల ఉనికి వంటి పరిణామాలతో అమెరికా సహా పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించి ఏడాదికి పైగా అయింది. దీనితో భారత్ నుంచి అమెరికాకు వివిధ స్థాయిల వీసాల ప్రాతిపదికన లేదా టూరిస్టులుగా వెళ్లాలనుకునే వారికి సుదీర్ఘ నిరీక్షణ తప్పడంలేదు.
అయితే ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అమెరికా ఇప్పుడు ప్రయాణ ఆంక్షల రద్దు నిర్ణయం తీసుకుంది. ఇది 8వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీని మేరకు ఇప్పుడు తాజా ప్రయాణ మార్గదర్శకాలను అధికారికంగా వెలువరించింది. ఇందులో రెండు డోసుల టీకాలు ప్రధాన అంశం. ఇక ఇతరత్రా పోట్రోకాల్స్‌లో భాగంగా ప్రయాణాలకు ముందు కరోనా పరీక్షలలో వైరస్ లేదని తెలిపే నిర్థారణ పత్రాలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్‌లు వేసుకోకుండా ఉన్న వారు వారు అమెరికన్లు అయినా, చట్టపరమైన శాశ్వత నివాసితులు (ఎల్‌పిఆర్‌లు) లేదా కొన్ని కారణాలతో వ్యాక్సిన్లు పొందకుండా ఉండేందుకు ఆమోదం దక్కిన విదేశీయులు అయినా ప్రయాణానికి ఒక్కరోజు ముందు ఖచ్చితంగా వైరస్ సంబంధిత పరీక్షలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు పొందిన వారు కూడా అమెరికా ప్రయాణానికి మూడు రోజుల ముందు పొందిన నెగెటివ్ టెస్ట్ పత్రాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. రెండు డోస్‌లు పొందిన నిర్థారణ పత్రంతో పాటు దీనిని చూపితేనే వారికి ప్రయాణానికి వీలేర్పడుతుంది.
వ్యాక్సిన్ల అవకాశం లేని పిల్లలు పెద్దలతో కలిసి వెళ్లుతుంటే లేదా ఒంటరిగా వెళ్లినా వారు కూడా వైరస్ సంబంధిత టెస్టు పత్రాలను చూపాల్సి ఉంటుంది. ఇక ప్రయాణికులు చూపే వ్యాక్సినేషన్ పత్రాలు, నెగెటివ్ టెస్టు పత్రాలను సరైనవేనా? అనే విషయాన్ని సంబంధిత విమానయాన సంస్థలు పలు స్థాయిలలో ధృవీకరించుకుని వాటి విశ్వసనీయతను నిర్థారించుకోవల్సి ఉంటుందని అధికార వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.
పత్రాలలో తేడా ఉన్నట్లు తేలితే, కరోనా ఉన్నట్లు నిర్థారణ అయితే వెంటనే వారిని ప్రయాణానికి అనర్హులుగా ప్రకటించి ఇంటికి పంపిస్తారు. అమెరికా ప్రయాణానికి సంబంధించి ఆమోదిత వ్యాక్సిన్లను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నారు. ఎఫ్‌డిఎ ఆమోదిత లేదా అధీకృత వ్యాక్సిన్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వాడకపు జాబితాలోని వ్యాక్సిన్లకు గుర్తింపు ఉంటుంది. వీటిని పొందిన వారిని ప్రయాణ ఆంక్షల సడలింపుల పరిధిలోకి తీసుకువస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
More Stories
ఈజిప్ట్ ఆలయాల్లో వేలాది పశువుల పుర్రెలు
అమెరికాలో భారత జర్నలిస్ట్పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాకు విపత్తు … ట్రంప్ హెచ్చరిక