అనిల్‌ దేశ్‌ముఖ్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌. స‌చిన్ వాజేకు పోలీస్ కస్టడీ

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా,   బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ముంబై మాజీ పోలీస్ అధికారి స‌చిన్ వాజేకు ఎస్ప్లాన‌డే కోర్టు ఈ నెల 13 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీ విధించింది. 
 
మనీలాండరింగ్ కేసుపై ఈ నెల 1న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయనను అరెస్ట్‌ చేసింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో శనివారం ముంబై సెలవు కోర్టులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. 
అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరోవైపు దేశ్‌ముఖ్‌కు బెయిల్‌ కోసం ఆయన న్యాయవాదులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.
 
కాగా, కేసుకు సంబంధించి సచిన్ వాజే వాంగ్మూలం న‌మోదు చేయాల‌ని, అందుకోసం ఆయ‌న‌ను 10 రోజులు త‌మ క‌స్టడీకి అప్ప‌గించాలని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టును కోర‌డంతో.. కోర్టు అందుకు అంగీకారం తెలిపింది. దాంతో పోలీసులు ఈ నెల 8న స‌చిన్ వాజే వాంగ్మూలం న‌మోదు చేసే అవ‌కాశం ఉన్న‌ది.

ఇటీవ‌ల న‌వంబ‌ర్ 1న కూడా ఎస్ప్లాన‌డే కోర్టు సచిన్ వాజేను ఆరు రోజులు (న‌వంబ‌ర్ 6 వ‌ర‌కు) పోలీస్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. అయితే పోలీసులు మ‌రో 10 రోజుల క‌స్ట‌డీ కోర‌డంతో తాజాగా మ‌రోసారి పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తించింది. బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల కేసులో జూలై 23న స‌చిన్ వాజేతోపాటు ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ త‌దిత‌రుల‌పై గోరేగావ్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

ముంబైలోని హోటళ్లు, బార్‌ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్ వాజ్‌ను హోంమంత్రి హోదాలో అనిల్‌ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
 
ఈ నేపథ్యంలో ఈడీ కూడా మనీలాండరింగ్ కింద దీనిపై విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా అనిల్‌ దేశ్‌ముఖ్‌ను 12 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈ నెల 1న ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ గడువు ముగియడంతో అనిల్ దేశ్‌ముఖ్‌కు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.