
బాలీవుడ్ స్టార్‌హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ముంబై జోన్ ఎన్‌సీబీ నుంచి ఎన్‌సీబీ సెంట్రల్ టీమ్‌కు బదిలీ అయింది. కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ ముంబై యూనిట్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను తొలగించారు.
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మేనల్లుడు సమీర్ ఖాన్ కేసుతో సహా మరో ఐదు కేసులను సైతం ఎన్‌సీబీ సెంట్రల్ జోన్‌కు బదిలీ చేశారు. ఈ మొత్తం ఐదు కేసులకు ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ పర్యవేక్షణా అధికారిగా వ్యవహరించనున్నారు.
ఈ కేసులకు దేశీయ, అంతర్జాతీయ సంబంధాలు ఉన్నందున ఇతర ఏజెన్సీలతో సమన్వయం అవసరమని, ఆ కారణంగానే కేసుల బదిలీ జరిగినట్టు ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి కేసులు బదిలీ అయినప్పటికీ సమీర్ వాంఖడే మాత్రం ఎన్‌సీబీ ముంబై యూనిట్ జోనల్ అధికారిగా కొనసాగుతారు.
తాజా పరిణామంపై వాంఖడే మాట్లాడుతూ, విచారణ నుంచి తనను తొలగించలేదని స్పష్టం చేశారు. సెంట్రల్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోర్టులో తన రిట్ పిటిషన్ ఉందని, ఆ కారణంగానే ఆర్యన్, సమీర్ ఖాన్ కేసులను ఢిల్లీ ఎన్‌సీబీ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేయనుందని చెప్పారు. ఎన్‌సీబీ ఢిల్లీ, ముంబై టీమ్‌ల మధ్య సమన్వయంగా ఈ పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. కాగా, ఇది పాలనాపరమైన నిర్ణయంగా సౌత్-వెస్ట్ రీజియన్ ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ తెలిపారు.
ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారంనాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ ముందు హాజరుకావాలనే బెయిల్ షరతులకు లోబడి ఆయన ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చారు. గంటసేపు అక్కడే ఉన్నారు.
క్రూయిజ్ డ్రగ్ కేసు దర్యాప్తుకు ఇప్పుడు నియమించిన సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ఈయన పలు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ల గుట్టును రట్టు చేసి సమర్ధ అధికారిగా పేరొందారు.
సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్ ఒడిశా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) క్యాడర్ అధికారి.ఎన్సీబీలో చేరడానికి ముందు సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)కి అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా నాయకత్వం వహించారు. డీటీఎఫ్ లో ఉన్నపుడు సింగ్ ఒడిశా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్‌లను ప్రారంభించారు.
భువనేశ్వర్‌లో పలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్‌లను ఛేదించారు.2008లో సింగ్ సీబీఐలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా 2015 వరకు పనిచేశారు. సీబీఐలో పనిచేసిన సమయంలో ఇతను పలు హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు.సింగ్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేదా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని సమర్ధ అధికారిగా గుర్తింపు పొందారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.
More Stories
నాగపూర్ హింసాకాండపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ