ప్రభుత్వ పధకాల ద్వారానే కాకుండా, పార్టీ పరంగా కూడా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజారాబాద్ ఉపఎన్నికలో పరాజయం తప్పకపోవడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక వంక అలజడికి గురవుతుండగా, ఈ ఉపఎన్నిక ఫలితం పొరుగు తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్నట్లు చెబుతున్నారు. సొంత జిల్లా బద్వేల్ లో తనకన్నా ఎక్కువ ఆధిక్యతతో తమ పార్టీ అభ్యర్థి గెలుపొందిన ఆనందం ఆయనలో ఆవిరైనట్లు తెలుస్తున్నది.
హుజురాబాద్ ఎన్నికను ప్రతిష్టాకరంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ తన నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ ను ఓడించడం కోసం అనుసరించిన వ్యూహంతోనే ఏపీలో మరోమారు అధికారంలోకి రావాలని మొదటిసారి అధికారం చేపట్టిన రోజు నుండే జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.
అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలివేసి, కేవలం సంక్షేమ పథకాల అమలు ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఓట్ బ్యాంకు గా మార్చుకొని, సొంత పార్టీ బలంతో సంబంధం లేకుండా రెండోసారి గెలుపొందాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న, ఉద్యోగుల జీతబాధ్యలకు సహితం ఇబ్బందులు పడుతున్నా, వీలయినన్ని అప్పులు చేసి సంక్షేమ పధకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ సమావేశం జరపగా పోవడం గమనార్హం. గ్రామా వాలంటీర్లను నియమించి, వారినే పార్టీ కార్యకర్తలుగా పనులు చేయించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుజురాబాద్ లో కేసీఆర్ అటువంటి ప్రయత్నం చేసి ఘోరంగా విఫలం కావడం సహజంగానే జగన్ కు ఆందోళన కలిగించే అంశం.
ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘దళిత బంధు’… టీఆర్ఎస్‌ను గెలిపించలేకపోయింది. కేవలం సంక్షేమ పథకాలే తనను మరోసారి సీఎం పీఠంపై కూచోపెడతాయన్న అంచనాలు తలకిందులవుతాయనే సంకేతం లభించిన్నట్లు అయింది. ప్రభుత్వ పధకాల లబ్ధిదారులు సహితం అధికార పార్టీకి ఓట్ వేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
హుజూరాబాద్ ఫలితాన్ని అధ్యయనం చేయడం మంచింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 23,183 దళిత కుటుంబాల్లో 40 వేలకు పైగా ఉన్న దళిత ఓట్లన్నీ గంపగుత్తగా దక్కించుకోవాలనే కేసీఆర్ ప్రయత్నం వికటించింది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో జమచేస్తున్నా ఆశించినమేరకు ఓట్లు రాలేదు.
ఏపీలో సంక్షేమం తప్ప, అభివృద్ధి పనులేవీ జరగలేదని ఇప్పటికే సొంతపార్టీ వారి నుంచే అసంతృప్తి ఎదురవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులలో సహితం అసంతృప్తి నివురుగప్పిన నిప్పువలె ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. మొత్తం అధికార యంత్రాంగంన్ని పార్టీ యంత్రాంగం వలే మలచుకొని స్థానిక సంస్థ ఎన్నికలు, ఉపఎన్నికలలో ప్రభావం చూపినా సాధారణ ఎన్నికలలో సాధ్యం కాదని చంద్రబాబునాయుడు అనుభవం స్పష్టం చేస్తున్నది.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు కురిపించిన అంశాలతోనే అంతకన్నా దారుణంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం, ప్రభుత్వం భూములను కారుచవకగా అమ్మే ప్రయత్నం చేయడం, మూడు రాజధానుల పేరుతో పాలనలో అనిశ్చతకు దారితీయడం వంటి పలు అంశాలు ప్రజలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తికి దారితీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
హుజురాబాద్ లో ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందిన వర్గాల నుండి పూర్తి మద్దతు లభించక పోగా, వారి కారణంగా ఇతర వర్గాలకు కేసీఆర్ దూరం కావలసి వచ్చింది. ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ప్రజలతోనే కాకుండా, సొంత పార్టీ వర్గాలలో సహితం కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముందు ప్రకటించిన విధంగా వచ్చే డిసెంబర్ లో మూకుమ్మడిగా మంత్రివర్గాన్ని మార్చితే ఎదురు కాగల రాజకీయ పరిణామాల గురించి ఈ సందర్భంగా జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం