తెలంగాణాలో టోకెన్‌ ఉంటేనే వరి కోతలు

యాసంగిలో వరి సాగు చేస్తే ఉరే అన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే రైతుల్ని తిప్పలు పెడుతోంది. వరి కోతలు మొదలై నెల రోజులవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. గతంలో పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు పడిన రైతులకు… నేడు పంట కోయాలన్నా తిప్పలు తప్పడంలేదు. 
 
అధికారుల నుంచి టోకెన్‌ తీసుకున్న రైతులే వరి కోతలు కోయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆకాశం మేఘావృతం కావడం,  అకాల వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఆలస్యమైతే పంట చేతికందకుండా పోతుందోనని రైతులు టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. కోతకొచ్చిన వరి పంటను కోయకుండా ఆలస్యం చేస్తే  కంకుల్లోంచి వడ్లు రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు. 
 
వచ్చే యాసంగిలో వరిపంట సాగు చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆందోళన  చెందుతుంటే,  ఈ వానాకాలంలో వేసిన పంటనే కోయొద్దని అధికారులు చెబుతున్నారని.. ఇవేం ఆంక్షలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక టోకెన్‌ రెండకరాల్లో పంటకే వర్తిస్తుందట! అంటే 8 ఎకరాలున్న రైతు పంటను కోయాలంటే 4 టోకెన్లు తీసుకోవాలి!  
 
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. అందులో ఐదు లక్షల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేయగా ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు రకం ధాన్యాన్ని ఐకెపి, పిఎసిఎస్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులు కొనుగోలు చేస్తుండగా, సన్నరకం మాత్రం నేరుగా రైస్‌ మిల్లుల యజమానులే కొనుగోలు చేస్తుంటారు.

టోకెన్‌ తీసుకున్న రైతుకు ధాన్యం తీసుకురావాల్సిన తేదీ, రైస్‌మిల్లు పేరు రాసిస్తారు. రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికే తీసుకుపోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్ల కోసం రైతులు పండుగ… పబ్బం లేకుండా తిరుగుతున్నారు. గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వందల సంఖ్యలో రైతులు టోకెన్ల కోెసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.
 
శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద సుమారు వెయ్యి మంది రైతులు టోకెన్ల కోసం బారులు తీరారు. అధికారులు వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రైతులందరికీ టోకెన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రాస్తారోకో చేశారు.
 
దీపావళికి కాస్త ముందే వరికోతలు ఉధృతంగా సాగుతాయని అంచనా వేసి.. ఆ దిశగా పంట కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టి.. మిల్లర్లను సిద్ధం చేయాల్సిన అధికారులు తమ బాధ్యతలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. వరికోతలు ఒకట్రెండ్రోజులు ఆలస్యమైతేనే క్వింటాకు 10-15కిలోలు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
టోకెన్ల విధానం రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పెద్ద మొత్తంలో వచ్చిన వరికోత యంత్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్తున్నాయి. దీంతో వరికోత యంత్రాలకు కొరత ఏర్పడి, గంటకు రూ.300-రూ.400 ఎక్కువ తీసుకుంటున్నారు. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు.  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యాన్ని తగుల బెట్టి  నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం పేరుకుపోతోందని,  రైతులపై అదనపు భారం పడుతోందని అన్నారు. రెండు రోజుల్లో  కొనుగోళ్లు  ప్రారంభించకపోతే మండల కేంద్రంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.