తిరిగి పెద్దఎత్తున నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌

కరోనా మహమ్మారితో, అటవీ ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలు లభించక పలువురు కీలక నేతలను కోల్పోవడం లేదా అనారోగ్యంకు గురికావడంతో వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులను ఏరివేయడం కోసం మరోసారి సాయుధదళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టనున్నాయి. వర్షాకాలం ముగియడంతో అడవులలో ఇప్పుడు గాలింపు సులభం కావడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 
 
నక్సల్స్‌కు గట్టి పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడి, భద్రతా శిబిరాలను  ఏర్పాటు చేయడం ద్వారా రెండంచెల వ్యూహలను బలగాలు అనుసరిస్తున్నాయి. నక్సల్స్ ఉనికి ఇప్పటికీ కనిపిస్తున్న ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్లు చేపట్టనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. 
 
ఈ ఏడాదిలో 24 ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్‌లు (ఎఫ్ఓబీ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 10 ఛత్తీస్‌గఢ్‌లో, 7 మహారాష్ట్రలో, 6 జార్ఖాండ్‌లో, ఒకటి ఒడిశాలో ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు జార్ఖండ్, ఒడిశాలో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసే విషయమై కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 
 
కొత్తగా పోలీస్, పారామిలటరీ శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా నక్సల్స్‌ను కార్నర్ చేయడం, నక్సల్ ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించడం, మావోయిస్టు అగ్రవేతలు ఉనికి కోల్పోయేలా చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని చెప్పారు.
 
ఆయా రాష్ట్ర పోలీసుల సమన్వయంతో కోబ్రా, సీఆర్‌పీఎఫ్ యాంటీ నక్సల్ స్పెషలైజ్డ్ విభాగం మావోయిస్టులపైన, ముఖ్యంగా అగ్రనేతల కదలికలపైన కన్నువేసింది. నక్సల్స్ కీలక ప్రాంతాల్లో ప్రధానంగా సెక్యూరిటీ శిబిరాలు విస్తరించేందుకు వ్యూహరచన జరుగుతోంది. 
వర్షాలు ముగియడంతో సెక్యూరిటీ శిబిరాల విస్తరణ పని ఇప్పటికే వేగవంతమైంది. త్వరలోనే భారీ స్థాయిలో యాంటీ-నక్సల్ ఆపరేషన్ మొదలవుతుందని చెబుతున్నారు.