
ప్రపంచ దేశాలను ఇప్పటికీ వణికిస్తున్న హెచ్ఐవీ వైరస్ ను కట్టడి చేసే టీకా త్వరలో మానవాళికి అందుబాటులోకి రాబోతున్నది. ఎయిడ్స్‌పై 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికేలా వైద్యులు త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని హార్వార్డ్ ప్రొఫెసర్ ఫిల్లిస్ కంకి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు.
“హెచ్‌ఐవీ మహమ్మారికి ముగింపు పలికేందుకు మనం దగ్గరయ్యాం. అంతవరకూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చికిత్స కొనసాగించడం అనివార్యం. ఇప్పటికి ఓ పదేళ్ల తర్వాత చూస్తే ఎయిడ్స్ ఒక అరుదైన డిసీజ్‌గా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉందని నా బలమైన నమ్మకం” అని ఆయన పేర్కొన్నారు.
జీవితాన్ని ఎంతో సాఫీగా, నాణ్యతాయుతంగా గడిపే అవకాశం ఉందని హార్వార్డ్ హెల్త్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్లిస్ కంకి తెలిపారు. ఎయిడ్స్‌పై పోరాటానికి తెరదింపే వ్యాక్సిన్ రావచ్చని, ఇందువల్ల ఇన్‌ఫెక్షన్ రిస్క్ తగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 3.7 కోట్ల మంది హెచ్ఐవీ లేదా ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని అంచనా. దీనికి తోడు ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని కూడా చెబుతున్నారు. ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిన్ అనే డ్రగ్ హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తోందని చెబుతున్నప్పటికీ ఇది వ్యాక్సిన్ తరహాలో కాకుండా ప్రతిరోజూ తీసుకోవాల్సి రావడంతో వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ కనుగొనడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.
గతంలో వ్యాక్సిన్ ప్రయత్నాలు జరిగినా కొన్ని ప్రాంతాలకు చెందిన హెచ్ఐవీ రకాలకు మాత్రమే అవి పరిమితమవుతూ వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల హెచ్ఐవీ వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ కోసం వైద్యులు అహరహం శ్రమిస్తూనే ఉన్నారు.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం