రామజన్మభూమి ట్రస్టుకు టీసీఎస్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌

రామజన్మభూమి ట్రస్టు నిధులు రూ.3,000 కోట్లు దాటడంతో లెక్కల నిర్వహణ బాధ్యతను ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ట్రస్టు అప్పగించింది. లెక్కల నిర్వహణ కోసం అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. 

భూముల ఒప్పందాలపై ఇటీవల వివిదాలు తలెత్తిన క్రమంలో నిధుల నిర్వహణ బాధ్యతను టీసీఎస్‌కు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల నిర్వహణ బాధ్యతను టీసీఎస్ టేకోవర్ చేసిన విషయాన్ని టెంపుల్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ధ్రువీకరించారు.

వివాదాస్పద భూమి లావాదేవీల ఆరోపణల దృష్ట్యా ట్రస్ట్ అకౌంట్లు చూసే బాధ్యతను ఒక ప్రొఫెషనల్ సంస్థకు అప్పగించే ప్రయత్నం చేయాలని  ఆర్ఎస్ఎస్ ఇటీవల సూచించినట్లు తెలుస్తున్నది. రామజన్మభూమి సమీపంలోని రామ్‌ఘాట్ వద్ద అకౌంట్స్ కార్యాలయాన్ని టీసీఎస్ ఏర్పాటు చేసి, డిసెంబర్ నాటికి అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకు రావాలనే ఆలోచనలో ఉంది.

ఆ తర్వాత ట్రస్టు అకౌంట్ల నిర్వహణ, డిజిటలైజేషన్ మొదలవుతుంది. టాటా గ్రూప్‌ ఐటీ నిపుణులు ఇటీవల ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాకు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. 

కాగా, ట్రస్టు అవసరాలు ఏమిటనే విషయమై టీసీఎస్ సాఫ్ట్‌వేర్ నిపుణులతో చర్చించామని, కంపెనీ అకౌంట్స్ సిస్టమ్‌ను వారు ఇన్‌స్టాల్ చేస్తారని చంపత్ రాయ్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఆలయ అకౌంట్ల నిర్వహణ, డిజిటలైజేషన్ టీసీఎస్ చేపడుతుందని చెప్పారు. మరోవంక, చార్టెట్ అకౌంటెంట్ల బృందం టెంపుల్ ట్రస్ట్ ఆదాయం, ఖర్చులకు సంబంధించిన అకౌంట్ల నిర్వహణను కొనసాగిస్తుందని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.