హుజురాబాద్ నుంచే కేసీఆర్‌‌‌‌ రాజకీయాలకు చెక్

శాసనసభలో స్పష్టమైన ఆధిక్యత ఉన్న పాలక పక్షంపై ఒక నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నిక జయాపజయాలు ఎటువంటి ప్రభావం చూపలేవు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన మాజీ  ఈటెల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందటం తెలంగాణా ప్రజలు నూతన రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 
 
మొన్ననే టీఆర్‌‌‌‌ఎస్‌‌ 20వ వార్షికోత్సవాలను కేసీఆర్ ఘనంగా జరుపుతున్నారు. ఇదే సమయంలో జరిగిన ఈ ఉపఎన్నిక ఒక విధంగా  రాజకీయ మనుగడకు,  కుమారుడు కేటీఆర్ కు అధికారం అప్పచెప్పడానికి ఒక కీలక మలుపుగా పలువురు పరిగణించారు. తెలంగాణ  ఉద్యమంలో తొలినుండి వెన్నంటి ఉంటూ వస్తున్న ఈటెలను కేసీఆర్ కొంతకాలంగా దూరం చేసుకోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీలో, ప్రజలలో పట్టుగల నేతలు ఉంటె మనుగడ కష్టం కాగలదని భయమే అని చెప్పవచ్చు. 
 
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న వారిని పక్కన బెడుతూ, ఉద్యమ ద్రోహులు అనేకమందిని అందలం ఎక్కించడానికి సహితం ఉద్యమ నేపధ్యం లేని కేటీఆర్ నాయకత్వంను బలోపేతం చేయడం కోసమే. చివరకు మేనల్లుడు హరీష్ రావు ప్రాబల్యాన్ని సహితం అందుకోసం తగ్గిస్తూ వస్తున్నారు. 
 
2012లో మహబూబ్‌నగర్‌ లో టీఆర్‌ఎస్‌ నుంచి బయటకొచ్చిన యెన్నెం శ్రీనివాసర్‌రెడ్డి, 2020లో దుబ్బాకలో టీఆర్‌ఎస్‌  లో కీలక నేతగా చాలాకాలం కొనసాగిన  రఘునందన్‌రావు బిజెపి అభ్యర్థులుగా గెలుపొందినా  కేసీఆర్ నాయకత్వంకు చెప్పుకోదగిన ముప్పు ఏర్పడలేదు. 
 
కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. టీఆర్‌ఎస్‌ లో అంతర్గత చర్చలలో సహితం ఈటెల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరుతెన్నులను తప్పుబట్టడం కనిపిస్తున్నది. తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్,  టీఆర్‌ఎస్‌ ప్రాబల్యంకు ఈ ఎన్నికలు ముగింపు కాగలవనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తున్నది. 
 
కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లడాన్ని ఈ ఉపఎన్నిక స్పష్టం చేస్తున్నది. తెలంగాణ ప్రజలు నూతన రాజకీయాల కోసం చూస్తున్నట్లు కూడా వెల్లడైనది. ఈ సందర్భంగా బీజేపీ దృష్టిని ఆకట్టుకొంటున్నది. కేసీఆర్‌‌,‌‌ టీఆర్‌‌‌‌ఎస్‌‌ పతనం ప్రారంభమైన్నట్లు వెల్లడి అవుతున్నది.
 
దళితబంధు వంటి అనూహ్యమైన పధకం ప్రవేశపెట్టినా, రాత్రికి రాత్రి ప్రజలు  అభివృద్ధి పనులు అణ్డంచినా,  దేశంలో మరెక్కడా ఎరుగని రీతిలో ధనప్రవాహం  కొనసాగించినా, ఈటెలకు గ్రామస్థాయిలో అనుచరులు లేకుండా చేయడం కోసం మంత్రులు, అధికార పార్టీ నాయకులు నాలుగైదు నెలలపాటు మకాం వేసి ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసినా ఫలితం లేకపోయింది. 
 
 ఎన్నికల వ్యూహంలో తిరుగులేని వారుగా భావించే కేసీఆర్ ఈ పర్యాయం `తెలంగాణ సెంటిమెంట్’ ప్రయోగించి లబ్ది పొందలేక పోయారు. ఎందుకంటె తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటెల ముందు ఆ అస్త్రం పనిచేయదు. పైగా ఉద్యమ ద్రోహులు అధికార పక్షంలో అందలం ఎక్కుతూ ఉండడంతో ప్రజలలో ప్రతికూల సంకేతాలు పంపుతుందని భయపడ్డారు. 
 
గతంలో అనేకమంది పార్టీ నాయకులను అవమానాలకు గురిచేసి, వారికి పదవులు దక్కకుండా చేసినా కేసీఆర్ పై ఇంతగా ముప్పేట దాడి చేసినవారు లేరు. అనూహ్యంగా ఈటెల పార్టీకి, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరతారని ఊహించలేక పోయారు. ఈ ఎన్నిక `కేసీఆర్ – ఈటెల’ మధ్య జరుగుతున్న ఎన్నికగా ప్రజలు భావించేటట్లు చేయడంలో రాజేందర్ విజయం సాధించారు. అదే అధికారపక్షంకు అశనిపాతంగా మారింది. 
 
పైగా, కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం కూడా ప్రజలలో ప్రతికూల సంకేతాలు పంపింది. టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ ప్రగతి భవన్ ను బానిస భవన్ అంటూ కెసీఆర్ దగ్గర మంత్రులతోపాటు…ఎమ్మెల్యేలకూ ఎవరికి విలువ ఉండదని, అంతా నియంతృత్వం అని ఈటెల చేసిన ఆరోపణలు అధికార పక్షంలో కలకలం రేపాయి. 
 
పైగా,  తనతోపాటు మంత్రి హరీష్ రావు కూడా ఎన్నోసార్లు అవమానాలు జరిగాయని చెప్పడంతో పాటు అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో అసలు దళిత, గిరిజనులకు చోటు ఉందా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించడంతోనే కేసీఆర్ శిబిరం ఆత్మరక్షణలో పడింది. వెంటనే ఒక దళిత్ అధికారిని సీఎంఓలో నియమించడం కేసీఆర్ ను ఆయన ఎంతగా ఖంగారు పుట్టించారో వెల్లడి అవుతుంది.  
 
ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా, హైదరాబాద్ నుండి కేటీఆర్ చేసిన ప్రకటనలు ఒక విధంగా హుజురాబాద్ ప్రజలను రెచ్చగొట్టి, వారిలో ఈటెల ఇచ్చిన `ఆత్మగౌరవం’  నినాదంకు బలంగా స్పందించేటట్లు  చేసిన్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
 
హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్న అంశం అని అంటూనే  ఈటెల రాజేందర్ ఏమైనా జానారెడ్డి కంటే గొప్ప వ్యక్తా? నాగార్జున సాగర్ లో కొత్త కుర్రాడితో జానారెడ్డి లాంటి వ్యక్తిని కూడా ఓడించాం. అలాంటి సంచలన గెలుపుల చరిత్ర టీఆర్ఎస్ కు చాలా ఉందని కేటీఆర్ చేసిన వాఖ్యలు ప్రజలలో  పట్టుదలను పెంచాయి. 
 
కేసీఆర్  మంత్రివర్గంలో పలువురిపై తీవ్రమైన భూకబ్జా, భూదురాక్రమణ, అవినీతి ఆరోపణలు స్పష్టమైన ఆధారాలతో సహా వచ్చాయి. వాటి వీటిపై కనీసం అంతర్గత విచారణకు కూడా సిద్దపడని కేసీఆర్ ఈటెల పట్ల వ్యవహరించిన తీరు ప్రజలలో ఆయన పట్ల ఒకింత సానుభూతి కలిగించింది. 
 
మంత్రులకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం లభించని  ప్రగతి భవన్ లో ఎవ్వరో ఫిర్యాదు చేయడం, క్షణాలలో విచారణకు ఆదేశించడం, మరుసటి రోజే విచారణ నివేదిక ముఖ్యమంత్రికి చేరడం, వెంటనే ఈటెలను మంత్రివర్గం నుండి తొలగించడం …. అంతా సినిమా రీతిలో 24 గంటల లోపు జరిగి పోయింది. ఇదంతా దురుద్దేశ్యంతో, కుట్రపూరితంగా ఈటెల పట్ల వ్యవహరించారనే స్పష్టమైన సంకేతం ప్రజలకు చేరవేసింది. 
 
ఎవ్వరు వెళ్లినా మర్యాదగా పలుకరించి, వారు చెప్పే మాటలు వింటుండే ఈటెలను కేసీఆర్ అహంకార ధోరణిలో ప్రజలు పోల్చుకోవడం ప్రారంభించారు. దానితో ఈ ఉపఎన్నిక ప్రభావం మొత్తం తెలంగాణ అంతటా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక పోవడం, ఆ పార్టీ కీలక నేతలు అధికార పార్టీలో చేరిపోవడం చూస్తే  టీఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే సత్తా బిజేపికి మాత్రమే ఉన్నట్లు స్పష్టమైనది. 
 
తమ పరాజయాన్ని తట్టుకోలేక బిజెపి – కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని హరీష్ రావు, ఇతరులు చెప్పి సంతృప్తి పడుతున్నా కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరిని దాదాపుగా తమలో చేర్చుకున్న పార్టీ ఏదో ప్రజలకు తెలియని విషయం కాదు.