కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు బొందపెట్టారు 

కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు బొందపెట్టారని చెబుతూ  గెలుపును  హుజురాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నానని బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. డబ్బు, మద్యం, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, కేసీఆర్ అహంకారాన్ని హుజురాబాద్ ప్రజలు పాతరేశారని స్పష్టం చేశారు. తన తోలుతో చెప్పులు కుట్టించినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనంటూ తెలిపారు.  ప్రతి కుటుంబాన్ని టీఆర్ఎస్ వేధించినా ప్రజలు తన వైపు నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం టీఆర్ఎస్ బెదిరించిందని తెలిపారు.

  ‘ఇంత వేదన, అక్రమాలు, దుర్మాగాలు జరుగుతున్నా ఎక్కడో లోపం జరిగింది. ఈ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు. కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేశారు. డబ్బు సంచులు వెదజల్లినా హుజూరాబాద్ ప్రజలు నా వెంటే నడిచారు. నన్ను ఆదరించిన హుజూరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటా.’’ అని ఈటల పేర్కొన్నారు.   

ఎన్నికల సమయంలో అధికారులు నిజాయితీగా వ్యవహరించలేదని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాళ్లు ప్రతీ ఒక్కరినీ వేధించారని..అయినా కష్టాలు ఓర్చుకుని తన గెలుపు కోసం  పని చేశారని చెప్పారు. స్వేచ్ఛగా మాట్లాడలేని..తిరగలేని పరిస్థితి ఏర్పడిందని.. అలాంటివి పునరావృతం కావద్దని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని ఈటల పేర్కొన్నారు. నియోజకవర్గంలో శ్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చిందని చెబుతూ రాబోయే కాలంలో ఇలాంటి సంప్రదాయం ఉండకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్నికలు దేశ చరిత్రలో ఇవేనని ఈటల తెలిపారు.  

‘‘తెలంగాణలో  దోపిడీ రాజ్యం కొనసాగుతోంది. దళిత బంధు హుజురాబాద్‌లో అందరికి అమలు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలి. పేదరికంలో ఉన్న వారందరికీ బంధు లాంటి పథకం ఇవ్వాలి. డబుల్ బెడ్‌రూమ్‌లు సొంత స్థలాల్లో ఇల్లు కట్టివ్వాలి” అంటూ తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలను వెల్లడించారు.

అదే విధంగా,   నీళ్లు నిధులు నియామకాలు టాగ్ లైన్‌తో తెలంగాణ వచ్చిందని గుర్తు చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పింఛన్లు అందరికి ఇవ్వాలని, రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ  సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేస్తామని పేర్కొంటూ రాబోయే కాలంలో ఉద్యమ బిడ్డగా ఉంటాఅని ఈటల స్పష్టం చేశారు. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా ప్రజలకు అందు బాటులో ఉంటానని తెలిపారు.

కాగా, హుజూరాబాద్‌లో కమలం విరిసిందని, తెలంగాణ పాలకుల గుండె అదిరిందని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. కుట్రలు, వ్యూహాలు, అబద్ధపు ఆరోపణలు, ఫేక్ న్యూస్‌ల పరంపరతో ఎలాగైనా ఈటల గెలుపును అడ్డుకోవాలని అధికార పార్టీ సర్వ శక్తులూ ఒడ్డినదని ఆమె గుర్తు చేశారు. 

అయితే  అందరినీ అన్నీ సార్లూ మోసం చెయ్యడం సాధ్యం కాదని తెలంగాణ ప్రజలు చాచికొట్టి చెప్పారని ఆమె స్పష్టం చేశారు. ఈటల ఎదుగుదలను సహించలేక ఆయన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకు పంపడంలో మాత్రమే కేసీఆర్ విజయం సాధించారు తప్ప, ప్రజల హృదయాల నుంచి తప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని ఆమె ఎద్దేవా చేశారు.