గ్రూప్ కెప్టెన్ గా బాలకోట్‌ దాడుల హీరో అభినందన్

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా నిలిచిన వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక్‌కు ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది. భారత వైమానిక దళంలోని గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో కర్నల్‌ ర్యాంక్‌తో సమానం.

2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జవాన్లు అమరులుకాగా, పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసింది.

ఈ ఘటనలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. కాగా, భారత వాయుసేన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను అడ్డుకునేందుకు అత్యాధుక ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను పాకిస్థాన్‌ రంగంలోకి దించింది. మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడుపుతున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్, పాక్‌కు చెందిన ఒక ఎఫ్‌-16ను కూల్చివేశారు. ఈ సందర్భంగా కూలిపోతున్న మిగ్‌-21 నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

అయితే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన ఆయనను పాక్‌ ఆర్మీ నిర్బంధించింది. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను సురక్షితంగా తమకు అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్‌ నుంచి తీవ్ర ఒత్తిడి, అంతర్జాతీయ జోక్యంతో పాక్‌ దిగివచ్చింది. అదే రోజు రాత్రి వేళ అభినందన్‌ను భారత సైనిక అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో శౌర్య చక్ర అవార్డు అందుకున్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను తాజాగా గ్రూప్ కెప్టెన్ ర్యాంక్‌కు ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది. 

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో, పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ సభ్యుడు అయాజ్ సాదిక్ ఫిబ్రవరి 2019 సమావేశంలో జరిగిన సంఘటనలను వివరించాడు.  ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అభినందన్ వర్థమాన్‌ను గత్యంతరం లేకనే పాకిస్థాన్ విడుదల చేసిన్నట్లు స్పష్టంగా చెప్పాడు. 

“షా మహమూద్ ఖురేషీ (పాకిస్తాన్ విదేశాంగ మంత్రి) ఈ విషయమై జరిపిన సమావేశంకు (పాకిస్తాన్ ప్రధాని) ఇమ్రాన్ ఖాన్ హాజరుకావడానికి నిరాకరించారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ బజ్వా గదిలోకి వచ్చారు.  అతని కాళ్ళు వణుకుతున్నాయి. అతనికి చెమటలు పట్టాయి.  విదేశాంగ మంత్రి ‘దేవుని నిమిత్తం అభినందన్‌ను వెళ్లనివ్వండి, రాత్రి 9 గంటలకు భారత్ పాకిస్థాన్‌పై దాడి చేయబోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేసాడు” అంటూ ఆ నాటి సంఘటనలను వివరించాడు.

అయినప్పటికీ, మొదట్లో బాలాకోట్ లో భారత్ వైమానిక దాడి జరిపినట్లు అంగీకరించని ఇమ్రాన్ ఖాన్ , ఆ తర్వాత భారత్ వదిలిన బాంబులు గురితప్పి సమీప అడవిలో పడిపోయాయని అంటూ చెప్పుకొచ్చాడు.  వింగ్ కమాండర్ అభినందన్ గురించి  పాక్ ఆధారిత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో `భారత్ తో విశ్వాసం నెలకొల్పడం కోసం’  అతనిని `తిరిగి పంపాము’ అని చెప్పుకొచ్చాడు.

ఇలా ఉండగా, ఉగ్రవాదుల కాల్పులు, ఎన్‌కౌంటర్లతో నిత్యం దద్దరిల్లే జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ను 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలితో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. 

బత్పురా చౌక్ వద్ద రద్దీగా ఉండే వీధులలో వారు నడిచారు. అధికారులు, స్థానికులు, వ్యాపారులతో పాండే మాట్లాడారు. కొందరితో సెల్ఫీ దిగారు. దీపావళి సందర్భంగా స్వీట్లు బహుకరించారు. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఇటీవల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలి కలిసి షోపియాన్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.