టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్

భారత క్రికెట్ జట్టు (టీమిండియా) హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్  బీసీసీఐ నియమించింది. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్నది. దీంతో ఆయన స్థానంలో రాహుల్  ద్రావిడ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అనేక తర్జన భర్జనలు, విశ్లేషణల తర్వాత ద్రవిడ్ ఎంపికకు బీసీసీఐ మొగ్గు చూపింది. 
 
తన నియామకంపై రాహుల్ ద్రావిడ్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను సాధించిందని కొనియాడారు. ఇదే విజయపరంపరను  ఆటగాళ్లందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రాహుల్ ద్రవిడ్ తెలిపారు. 
 
న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు నవంబర్ 17 నుంచి  హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ద్రావిడ్ నియామకాన్ని స్వాగతిస్తూ “రాహుల్ అద్భుతమైన క్రీడాకారుడు.ఈ క్రీడలో గొప్పగా రాణించిన వారిలో ఆయనొక్కరు.

నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కూడా భారత క్రికెట్‌కు విశిష్ట సేవలందించారు” అంటూ ప్రశంసించారు. ఎన్‌సిఎలో రాహుల్ చేసిన కృషి అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించిన అనేక మంది యువ క్రికెట్ ప్రతిభను పెంచిందని కొనియాడారు. ఆయన ఈ కొత్త హోదాలో భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నట్లు  ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పనిచేస్తున్న ద్రవిడ్‌ను 2023లో భారత్‌లో జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్ వరకు రెండేళ్లపాటు నియమించారు. ఇదిలా ఉండగా, రవిశాస్త్రి (టీమ్ మాజీ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్ శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్) మరియు విక్రమ్ రాథోర్ (బ్యాటింగ్ కోచ్) విజయవంతమైన పదవీకాలం పూర్తిచేసుకున్న బృందాన్ని బీసీసీఐ అభినందించింది.

“రవి శాస్త్రి ఆధ్వర్యంలో, భారత క్రికెట్ జట్టు ధైర్యమైన, నిర్భయమైన విధానాన్ని అవలంబించింది. స్వదేశంలో, బయటి పరిస్థితులలో విశ్వసనీయంగా ప్రదర్శించింది. ఇంగ్లండ్‌లో జరిగిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ టెస్టు ఫార్మాట్‌లో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్‌కు చేరుకుంది” అని కొనియాడుతూ బీసీసీఐ ఒక  ప్రకటనలో తెలిపింది.

“ఆస్ట్రేలియాలో (2018-19) టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న మొదటి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. 2020-21లో మరో సిరీస్ విజయంతో దానిని అనుసరించింది. న్యూజిలాండ్‌ను 5-0తో ఓడించినప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లో మొత్తం 5 టి20లను గెలిచిన మొదటి జట్టుగా కూడా భారత్ నిలిచింది. శాస్త్రి, ఆయన బృందం  మార్గదర్శకత్వంలో, భారత్ స్వదేశంలో ఏడు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది” అని పేర్కొంది.