వ్యాక్సినేషన్‌ పెంచేందుకు ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’

దేశంలో కరోనా  టీకాల పంపిణీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’ పేరిట ఇంటింటికీ కరోనా టీకాల పంపిణీ  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై ఇంటింటికి టీకాల ప్రక్రియను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. అత్యధికులు ఇప్పటికే దేశవ్యాప్తంగా తొలి డోస్ పొందినా, ఇక రెండో డోస్ కూడా పొందాల్సిన వారికి కూడా వ్యాక్సినేషన్ జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

వ్యాక్సినేషన్ల విషయంలో అధికారులు ఇప్పటివరకూ ఉన్న ధోరణిని విడనాడాలని ప్రధాని ఆదేశించారు. ఇంతవరకూ ప్రజలే టీకా కేంద్రాలకు తరలివచ్చే వారు. ఇక ఈ పద్ధతి మార్చుకుని ఇప్పటి మాదిరిగానే సురక్షిత రీతిలో అందరికీ ఇంటింటికి టీకాలు అందేలా చూడాల్సి ఉందని తెలిపారు. 

ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఇంటింటికి వెళ్లి టీకాలు అర్హులకు పడేలా చేయాల్సిన గురుతర బాధ్యత వారిదే. ఈ క్రమంలో హర్ ఘర్ టీకా, ఘర్ ఘర్ టీకా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ప్రధాని కోరారు. రెండు డోసుల టీకా వ్యక్తులకు రక్షణ కవచం ఏర్పడ్డట్లే, అయితే ఈ పరిధిలోనికి వారిని గుర్తించి, రెండు డోసులు అందేలా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కరోనా నుంచి రక్షణ వలయాన్ని విస్తరించుకోవచ్చునని ప్రధాని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ మహమ్మారిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారని చెబుతూ 100కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయడంలో భారత్‌ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచం ప్రశంసించిందని  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ గుర్తు చేశారు.   

ప్రజలకు భద్రత కల్పించాలని నిర్ణయించుకున్న మోదీ ప్రభుత్వం   ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిందని ట్వీట్‌ చేశారు.  ఇప్పుడు ‘హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా ‘(ఇంటింటికి టీకా) స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్గో పర్యటన  అనంతరం టీకా కవరేజీ తక్కువ ఉన్న జిల్లాలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో కొవిడ్‌ మొదటి డోస్‌ 50శాతం కంటే తక్కువ, రెండో డోస్‌ తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలపై సమీక్ష జరిపారు. జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయతో పాటు పలు రాష్ట్రాల్లోని 40కిపైగా జిల్లాల కలెక్టర్లతో ప్రధాని భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని ప్రధాని హెచ్చరించారు. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదని హితవు చెప్పారు. అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని చెబుతూ ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇవ్వాలని అధికారులకు ప్రధాని సూచించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యమంత్రి స్పందిస్తూ.. త్వరలోనే మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి డోసుతో పాటు రెండో డోసు తీసుకోని వారికి టీకాలు వేయనున్నట్లు చెప్పారు.