‘‘భారత్ 2070 సంవత్సరానికల్లా కర్బన ఉద్గారాల రహిత(నెట్‌జీరో) దేశంగా మారుతుంది. అందుకోసం మేము 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఆ లక్ష్యాలను చేరుకుంటాం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సోమవారం స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగిన కాప్26 సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో ఆయన ప్రసంగించారు.
‘‘2030 కల్లా మేము నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకు న్నాం. అందులో కీలకమైనది.. శిలాజేతర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం. రెండోది మొత్తం కరెంటు వినియోగంలో పునరుత్పాదక విద్యుత్తు వాటాను 50 శాతానికి పెంచ డం. మూడోది కార్బన ఉద్గారాల విడుదలను 100 కోట్ల టన్నుల మేర తగ్గించడం. చివరిది.. కర్బన తీవ్రతను 45% దాకా తగ్గించడం. ఈ చర్యల ద్వారా 2070 కల్లా కర్బన ఉద్ఘారాల విడుదల విషయంలో భారత్‌ను నెట్‌జీరో స్థాయికి తీసుకువస్తాం’’ అని ప్రధాని వివరించారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఆయన ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు.
ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు.
వాతావరణ మార్పుల నియంత్రణకు కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడంపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయని చెబుతూ అయితే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విడుదల నియంత్రణకు కొన్ని శాశ్వత పరిష్కార పద్ధతులను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు.
కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేసే దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం తీవ్రతను తగ్గించడంపైనే దృష్టి పెట్టడం అన్యాయమే అని మోదీ విచారం వ్యక్తం చేశారు. భారత్‌లో ఈ పరిస్థితిని దూరం చేయడానికి ఇంటింటికీ నల్లా నీళ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు.
సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని ప్రధాని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని ప్రధాని వెల్లడించారు.
వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇలా ఉండగా,ప్రపంచ దేశాలకు అమెరికా క్షమాపణలు చెప్పింది. కాప్26 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘గత పాలకుడు(డొనాల్డ్ ట్రంప్) పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకొంటోందని ప్రకటించారు. నిజానికి ఈ ఒప్పందం అమలులో అమెరికా 8-బాల్(బిలియర్డ్స్‌లో కీలకమైన బంతి) వంటిది. అలాంటి దేశం తప్పుకోవడం పట్ల క్షమాపణ కోరుతున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!