మెజారిటీని నిలబెట్టుకున్న జపాన్ సంకీర్ణం

జపాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పాలక సంకీర్ణం మెజారిటీని నిలబెట్టుకుంది. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డిపి), దాని భాగస్వామి కొమెటోలతో కూడిన సంకీర్ణం దిగువ సభలో తగిన మెజారిటీ సాధించింది.

దీంతో ప్రధాని ఫ్యుమియో కిషిడా తన విధానాలను అమలు చేసేందుకు ప్రజా ఆమోదం లభించినట్లైంది. ఇంతకు ముందుతో పోల్చితే పాలక ఎల్‌డిపి 17సీట్లు కోల్పోయి 259 స్థానాలతో సరిపెట్టుకుంది. సంకీర్ణ భాగస్వామి కొమెటోకి 32సీట్లు రాగా, 465 సీట్లుగల దిగువ సభలో పాలక సంకీర్ణానికి మొత్తంగా 291 సీట్లు లభించాయి. 

అన్ని స్థాయీ సంఘాలకు, చట్టబద్ధమైన క్రమాలు చేపట్టేందుకు ఈ మెజారిటీ సరిపోతుంది. ఎగువ సభతో పోలిస్తే దిగువ సభకు ప్రత్యేకాధికారాలు వుంటాయి. ప్రధాని ఎంపికలో కూడా ఈ సభదే తుది అధికారం అవుతుంది. ప్రభుత్వ బడ్జెట్‌లను ఆమోదించడం, అంతర్జాతీయ ఒప్పందాలను ధ్రువీకరించడం అంతా దిగువ సభ వ్యవహారమే. 

ఐదు పార్టీలతో కూడిన ప్రధాన ప్రతిపక్షమైన కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ (సిడిపిజె) ఈసారి 96సీట్లతో సరిపెట్టుకుంది. గతంలో 110సీట్లు లభించాయి. సీట్లు కోల్పోవడం పట్ల సిడిపిజె నేత వుకియో ఎడనో క్షమాపణ చెప్పారు. జపాన్‌ ఇన్నొవేషన్‌ పార్టీకి 41సీట్లు లభించాయి. 

ఈనెల 10న జపాన్‌ పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆ రోజున ప్రధానిగా కిషిడాను కొనసాగిస్తున్నట్లు ప్రకటిస్తారు. కేబినెట్‌లో కూడా పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అ క్టోబరు 4న పదవీ బాధ్యతలు స్వీకరించిన కిషిడా తన విధానాలను మరింత శీఘ్రగతిన ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

తన ‘నూతన పెట్టుబడిదారీవాదం’ పరిధిలో మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు మరిన్ని అందచేస్తాని ప్రతిన చేశారు. కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రధాని యోషిడె సుగా రాజీనామా చేయడంలో కిషిడా బాధ్యతలు చేపట్టారు. 

పాలక సంకీర్ణానికి మెజారిటీ లభించినప్పటికీ ఈసారి పోలైన ఓట్ల శాతం కేవలం 55.33శాతం మాత్రమే. దీంతో మొత్తంగా రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నిరాశ కలిగిందని, వారి భ్రమలు తొలగిపోయాయని దీన్ని బట్టి వెల్లడవుతోంది.