తమను గుర్తించక పోతే ముప్పే … తాలిబన్ల హెచ్చరిక 

ఆఫ్ఘానిస్తాన్ లో తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని గుర్తించకపోతే అంతర్జాతీయ సమాజానికి ముప్పే అని తాలిబన్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.  ఆఫ్ఘన్ నుంచి ముప్పు రాకూడదనుకుంటే తమను గుర్తించాలని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. 

తమను బాధ్యతాయుతమైన పక్షంగా తప్పనిసరిగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. తమను గుర్తించే వరకు ముప్పును నివారించేందుకు తాము ఎటువంటి బాధ్యత తీసుకోబోమని కూడా తేల్చి చెప్పారు. పైగా, తమకు గుర్తింపు ఇవ్వడం ద్వైపాక్షిక అవసరమని తెలుసుకోవాలని హితవు చెప్పారు. 

తాము అమెరికాతో పోరాడటానికి కారణం ఆ దేశం గతంలో తమకు గుర్తింపునివ్వకపోవడమేనని ఈ సందర్భంగా చెప్పారు. తాలిబన్లకు గుర్తింపునివ్వకపోతే, ఆఫ్ఘనిస్థాన్, ఈ ప్రాంతం, ప్రపంచంలో సమస్యలు పెరుగుతాయని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. గుర్తింపు సాధించేందుకు అవసరమైన అన్ని ముందస్తు షరతులను తాము పూర్తి చేశామని తెలిపారు. 

 ప్రపంచం ఏదో ఒక విధంగా తమకు గుర్తింపునిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.  ఆఫ్ఘనిస్థాన్‌లో అన్ని దేశాల దౌత్య కార్యాలయాలను పునఃప్రారంభించాలని కోరారు.  తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌ను గుర్తించడంపై అంతర్జాతీయ సమాజం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

అయితే పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ దౌత్యవేత్తల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరో నెలలో ఆఫ్ఘన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను పునఃప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిసింది. తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలను పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.