1984 సిక్కుల ఊచకోతకు 37 ఏళ్ళు… న్యాయం దక్కేనా? 

స్వతంత్ర భారత దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఉచకోతగా  1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యా అనంతరం సిక్కులపై  దేశ వ్యాప్తంగా జరిగిన హత్యాకాండను పేర్కొనవచ్చు. ఈ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆ అల్లర్లు ఏ విధంగా జరిగాయో, ఎవ్వరు బాధ్యులో, ఎంత మందిని చంపారో, ఏమేరకు నష్టాలు జరిగాయో ప్రభుత్వం నిర్దుష్టంగా చెప్పలేక పోతున్నది. బాధితులకు న్యాయం ప్రశ్న తలెత్తడం లేదు. 
 
1984 అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన  ఆమె ఇద్దరు బాడీ గార్డ్ లు హత్యా కావించడంతో, నవంబర్ 1 నుండి దేశ వ్యాప్తంగా శిఖులపై సాయుధులైన అల్లరి మూకలు వెంటాడి దాడులు జరిపాయి. వివిధ అంచనాల ప్రకారం వాటిల్లో 10,000 మంది కంటే ఎక్కువగా చనిపోయారు.
అయితే అధికారిక రికార్డుల ప్రకారం, ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులు చనిపోయారు. వివిధ మానవ హక్కుల సంస్థలు 4,000 మంది వరకు చనిపోయిన్నట్లు చెబుతున్నాయి. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని వివరాలు కూడా నిర్దిష్టంగా లేవు. హత్యలతో పాటు అనేక గురుద్వారాలు, సిక్కులు నిర్వహించే దుకాణాలు, ఇతర వ్యాపారాలు, వారి గృహాలు కూడా విధ్వంసంకు  గురయ్యాయి. యధేచ్చగా దోపిడీలు జరిగాయి. మహిళలపై అత్యాచారం చేశారు.
ఢిల్లీ వీధులలో అత్యంత పాశవికంగా హత్యాకాండ సాగించారు. మేడలో టైర్లు వేసి మరీ సజీవదహనం చేశారు.  నెలల పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలివారి వరకు ఎవ్వరిని వదలలేదు. గర్భస్థ పిండాలను కడుపు చీల్చి, బయటకు లాగి మరీ చిదిమివేశారు…. ఆ నాటి అరాచక కాండ గురించి పలువురు ప్రత్యక్ష సాక్షుల కధనాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి. 
కత్తులు, కటార్లు వంటి ఆయుధాలతో అత్యంత అమానుషంగా దాడులు జరిపి బాధితులను కొట్టి చంపి సజీవ దహనం చేశారు. చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడంతో హత్యాకాండ పలు రోజులు కొనసాగింది. తమ ప్రధానమంత్రిని హత్య చేయడంతో కలత చెందిన ప్రజల ఆకస్మిక ప్రతిస్పందనగా ఈ మారణహోమాన్ని సమర్ధించే  ప్రయత్నాలు జరిగాయి. 
 
అయితే నిశితంగా పరిశీలన జరిపితే “సిక్కులకు గుణపాఠం నేర్పడానికి” చాలా చక్కగా రూపొందించిన, సమన్వయంతో కూడిన ప్రణాళిక ప్రకారం జరిగిన్నట్లు అర్ధం అవుతుంది. ఈ దాడులతో భయకంపితులైన  సిక్కులు  సుమారు 20,000 మంది ఢిల్లీ  వదిలి పారిపోయారు. మరో 1,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు. 
 
ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోని సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. ఢిల్లీ దాడులలో మాజీ కేంద్ర మంత్రి హెచ్‌కెఎల్‌ భగత్‌, కాంగ్రెస్‌ నేతలు జగదీష్‌ టైట్లర్‌, కాంగ్రెస్‌ ఎంపీలు  సజ్జన్‌ కుమార్‌, లలిత్‌ మకాన్‌, ధరమ్‌ దాస్‌ శాస్త్రి, అల్లర్ల కేసుల్లో, ఆకతాయిలను ప్రేరేపించినందుకుగానూ కీలక నిందితులు. అయితే వీరిలో కేవలం సజ్జన్ కుమార్ ను మాత్రమే ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
 
సిక్కులపై దాడులు కేవలం ఢిల్లీలో మాత్రమే జరిగాయని భావిస్తుంటాము. కానీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రామాదులరి సిన్హా పార్లమెంట్ లో జనవరి, 1985లో ఇచ్చిన సమాధానం ప్రకారం 16 రాష్ట్రాలలో హింసాయుత సంఘటనలు జరిగాయి. వాటిల్లో 12 రాష్ట్రాలలో హత్యలు జరిగాయి. 
ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ “మై బ్లీడింగ్ పంజాబ్” పేరుతో 1992లో ప్రచురించిన గ్రంధం ప్రకారం ఇందిరా గాంధీ హత్య జరిగిన రాత్రి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకులు “సిక్కులకు ఎప్పటికీ మరచిపోలేని గుణపాఠం ఎలా చెప్పాలో” నిర్ణయించడానికి సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. గుడిసెల పట్టణాలు, పొరుగు గ్రామాలలో నివసించే అసాంఘిక శక్తులను సమీకరించారు”. 
 
“సిక్కుల గృహాలు, దుకాణాలను గుర్తించారు. కమాండర్ ట్రక్కులలో  ఇనుప రాడ్లు, కిరోసిన్ నూనె డబ్బాలు, పెట్రోల్ లను సమకూర్చుకొని నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున, సిక్కు వ్యతిరేక హింసాకాండను ప్రారంభించారు. ఉక్కు కడ్డీలు, జెర్రీ క్యాన్ల నిండా కిరోసిన్ ఆయిల్, పెట్రోలింగ్‌తో ఆయుధాలతో కూడిన ట్రక్కుల లోడ్లు నగరం చుట్టూ తిరిగారు. గురుద్వారాలకు నిప్పు పెట్టారు” అని అందులో ఆయన వివరించారు. 
ఢిల్లీలో, అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు, పారా-మిలటరీ బలగాలు అసమర్ధులు కాకపోయినా అందుకు సుముఖంగా లేరని  కుష్వంత్  సింగ్ స్పష్టం చేశారు.అసలేమీ జరుగుతుందో గ్రహించడానికి అధికారులకు 24 గంటల సమయం పట్టింది. కర్ఫ్యూను ప్రకటించినా, విధించలేదు. చూడగానే కాల్పులు జరిపే అధికారం ఇచ్చినా, ఎక్కడా ఎవ్వరు అమలు పరచలేదు. 
 
వీధులలో పెట్రోలింగ్ పార్టీలు ఎక్కడ కనిపించక పోయినా ప్రభుత్వ ఆధీనంలోని ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎక్కువగా వినిపించిందని అంటూ ఆయన ఆ నాటి భయానిక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. గడువుకన్నా ముందే రాజీవ్ గాంధీ ఎన్నికలకు వెళ్లారు. అన్ని ప్రచార సాధనాల ద్వారా భారీ ప్రచారం ప్రారంభించారు.  అన్ని భాషల పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారు. అవి ఈ విధంగా సాగాయి:
 
 “దేశం సరిహద్దు చివర్లు  ఇంటి గుమ్మాలకు తరలించబడుతుందా?”  “వేరే రాష్ట్రానికి చెందిన టాక్సీ-డ్రైవర్ నడుపుతున్న టాక్సీలో ప్రయాణించడం మీకు ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది?” భారీ హోర్డింగ్‌లు యూనిఫాంలో ఉన్న ఇద్దరు సిక్కులు రక్తంతో తడిసిన శ్రీమతి గాంధీని భారతదేశం మ్యాప్ బ్యాక్‌డ్రాప్‌కు వ్యతిరేకంగా కాల్చడం లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్రంతో రాష్ట్రంలో పడి ఉన్న శ్రీమతి గాంధీ మృతదేహం ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ఈ ప్రకటనలు చూపించాయి.
 
2006లో ప్రచురించిన జస్కరన్ కౌర్ రచన “నవంబర్ 1984లో భారతదేశంలో సిక్కుల పోగ్రోమ్స్: ఎ రిపోర్ట్ బై ఎన్సాఫ్” లో
గుంపులు, టెలివిజన్‌లో, పరిసరాల్లోని హంతక పదాలు, నిరంతర పల్లవిలు సిక్కులను చంపాలనే ప్రబలమైన కోరికను ప్రదర్శించాయి. “ఖూన్ కా బద్లా ఖూన్,” (రక్తానికి రక్తం)  నినాదం ఎయిమ్స్ వద్ద ప్రారంభమై  ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్ ద్వారా భారతదేశం అంతటా ప్రతిధ్వనించింది. 
 
పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజిత్ సింగ్ నరులా, నవంబర్ 1 ఉదయం స్థానిక టెలివిజన్‌ లో శ్రీమతి గాంధీ మృతదేహం ఉన్న తీన్ మూర్తి వెలుపల ఉన్న జనం “ఖూన్ కా బద్లా ఖూన్” , “ఖూన్ కా బద్లా ఖూన్” అని నినాదాలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. సర్దార్ ఖౌమ్ కే గద్దర్, లేదా “సర్దార్లు దేశ ద్రోహులు” అని పెద్ద సంఖ్యలో ఆవేశపూరితంగా నినాదాలు ఇస్తుంటే వారిని ఆపడానికి ప్రభుత్వ అధికారులు ఎవ్వరు ప్రయత్నించగా పోవడాన్ని చూసారు. 
 
నూతనంగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్‌గాంధీ కూడా అటువంటి నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. తరచుగా వినిపించిన  ఇతర నినాదాలు: “మార్ డియో సలోన్ కో,” (ఆ వెధవలను చంపండి),  “సిఖోన్ కో మార్ దో ఔర్ లూట్ లో,”(సిక్కులను చంపి వారిని దోచుకోండి), “సర్దార్ కోయి భీ నహిన్ బచ్నే పై” (ఏ సర్దార్‌ని తప్పించుకోనివ్వవద్దు). 

అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమీషన్ 2005లో ప్రభుత్వంకు సమర్పించిన చివరి నివేదికలో హింసాత్మక దాడులు జరిగిన తీరును పరిశీలిస్తే, బహుశా సిక్కులపై దాడులు కాంగ్రెస్ లేదా వారి మద్దతుదారులు లేదా కొన్ని ఇతర సంస్థలు లేదా సంఘాలచే నిర్వహించబడి ఉండవచ్చని స్పష్టం చేసింది. రాకబ్ గంజ్ సాహిబ్ గురుద్వారా వద్ద విధ్వసం సృష్టించిన గుంపులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ నాథ్, వసంత్ సాఠే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం. 

ప్రధాని రాజీవ్ గాంధీ నవంబర్ 19, 1984న తన ప్రసంగంలో “ఇందిరాజీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మాకు తెలుసు. కొన్ని రోజులు భారతదేశం అల్లాడిపోయినట్లు అనిపించింది. కానీ ఒక బలమైన వృక్షం కూలినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం” అంటూ స్పష్టంగా ఈ అల్లర్లను సమర్ధించారు. 
 
  గురుచరణ్ సింగ్ బబ్బర్ సంపాదకీయంలో ఈ అల్లర్లపై ప్రచురించిన ఒక గ్రంధంలో ఒక సంఘటనను వివరించారు. మాజీ ప్రధాని, చరణ్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజీవ్ గాంధీని కలుసుకుని, కాంగ్రెస్ ఎంపీలు తమ మద్దతుదారులను కస్టడీ నుండి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. 
 
 “నేషనల్ హెరాల్డ్ దినపత్రిక కాంగ్రెస్ పార్టీకి చెందినట్లే, ఎక్స్‌ప్రెస్ ప్రతిపక్ష వార్తాపత్రిక” కాబట్టి వారి నివేదికను సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు” అంటూ ప్రధాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 

అధికారిక టెలివిజన్ దూరదర్శన్ లో కేవలం తీన్ మూర్తి భవన్ వద్ద గల ఇందిరాగాంధీ మృత దేశం గురించే గాని సిక్కుల ఊచకోత గురించిన ఎటువంటి కవరేజీని చేయలేదు.  శిఖులకు వ్యతిరేకంగా  నినాదాలు చేస్తున్న గుంపుల ఫుటేజీని పదే పదే చూపించడం గురించి భారత ప్రభుత్వం మిశ్రా విచారణ కమీషన్‌కు ఇచ్చిన సమాధానంలో ఇలా చెప్పింది:
 
 “’ఖూన్ కా బద్లా ఖూన్’, ‘సిఖ్ కౌమ్ కే గద్దర్’ వంటి నినాదాలు చేసే వ్యక్తులను దూరదర్శన్ చిత్రీకరింపలేదు. దివంగత ప్రధానమంత్రికి నివాళులు అర్పించేందుకు వరుసలో ఉన్న భారీ జనసమూహం దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో టీవీ కెమెరాల ఫోకస్ కొన్నిసార్లు వాటిని కూడా కవర్ చేసింది”.
 
మన్మోహన్ సింగ్ ప్రకటన 

2005లో, భారత ప్రధానమంత్రి, స్వయంగా సిక్కువాడైన డాక్టర్ మన్మోహన్ సింగ్, ఈ సంఘటనలపై తాజా న్యాయ విచారణకు సంబంధించి  లోక్‌సభలో ఈ విధంగా చెప్పారు: 

 
1984లో ఏమి జరిగింది? భయంకరమైన జాతీయ విషాదం. అది మనందరినీ సిగ్గుపడేలా చేసింది. శ్రీమతి ఇందిరా గాంధీ హత్య,  సిక్కు వ్యతిరేక అల్లర్లకు దారితీసిన తదుపరి సంఘటనలు. ఆ ఘోరమైన సంఘటనలు రెండూ ఎప్పుడూ జరగకూడదు. అవి మన జాతీయ మనస్సాక్షికి మచ్చ. 
 
ఈ విషయంలో  ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు ఉండవలసిన అవసరం లేదు.  కానీ ప్రశ్న తలెత్తుతుంది: “మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? 21 సంవత్సరాలు గడిచాయి; ఒకటి కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి; ఇప్పటికీ ఏదో నిజమో బయటపడలేదు. న్యాయం గెలవలేదు అనే భావన కొనసాగుతోంది.
 
అందువల్ల, ఈ సువిశాల భారతదేశంలో న్యాయాన్ని మన ప్రజలు అభినందిస్తున్నారనే భావనను కలిగించే ప్రక్రియలను మనం వేగవంతం చేసే మార్గాలను కనుగొనడం మన సమిష్టి బాధ్యత. చర్చ ఆ స్వరాన్ని తీసుకుంటే బాగుండేది. కానీ చర్చ ఇరుకైన, పక్షపాత ధోరణిలో ఉంది. దాని ప్రయోజనం నెరవేరదని నేను సభకు గౌరవంగా చెబుతున్నాను. …మరోసారి చెప్పండి, ఇది జాతీయ అవమానం,  గొప్ప జాతీయ, మానవ విషాదం.