హిందువునే… ఎస్సిని… వాంఖేడే స్పష్టం

బాలీవుడ్ న‌టుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను డ్ర‌గ్స్ కేసులో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోన‌ల్ డైర‌క్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే ను లక్ష్యంగా చేసుకొని మహారాష్ట్రలో అధికారమలో ఉన్న కూటమి నేతలు గత కొద్దీ రోజులుగా పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆయనపై వ్యక్తిగతంగా పలు ఆరోపణలు చేస్తున్నారు.
వాఖండే అసలు హిందువు కాదని, పుట్టకతో ముస్లిం అని, తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. స‌మీర్ వాంఖ‌డే ఓ ముస్లిం అని, అత‌నికి డీ కంపెనీతో లింకులు ఉన్నాయ‌ని కూడా ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉద్యోగం కోసం స‌మీర్ వాంఖ‌డే కులద్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఫోర్జ‌రీ చేసిన‌ట్లు ఆరోపించారు.
కమీషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్ ఆదివారం ముంబైలోని వాఖండే ఇంటికి వెళ్లి, ఆయన కుటుంభ సభ్యులను విచారించారు. ఆయన కులంకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. “ఒక ప్రభుత్వ అధికారి తప్పుడు సర్టిఫికెట్ లను ఇస్తాడని అనుకోను. ఈ విషయమై వస్తున్న వార్త కథనాలను చూస్తుంటే కొందరు వ్యక్తులు వాఖండే కు వ్యతిరేకంగా కుట్రపరితంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తున్నది” అని ఆరోపించారు.
తమ కమీషన్ షెడ్యూల్డ్ కులాలవారు రక్షణ కోసమే పనిచేస్తున్నదని స్పష్టం చేస్తూ, అటువంటి కుట్రపూరిత చర్యలు వెల్లడైతే అందుకు బాధ్యులైన వారిపై ఎస్సి, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద తగు చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ఈ నేప‌థ్యంలో ఇవాళ స‌మీర్ వాంఖ‌డే మౌనం వీడి నేడు త‌న కుల ద్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఢిల్లీలోని నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ షెడ్యూల్ క్యాస్ట్‌కు స‌మ‌ర్పించారు. తాను హిందువునే అని స్పష్టం చేస్తూ,  తాను మాత్రం షెడ్యూల్ కులానికి చెందిన‌ట్లు స‌మీర్ వాంఖ‌డే ఆధారాలు అందజేశారు. త‌న కుల‌ద్రువీక‌ర‌ణ‌కు చెందిన ప‌త్రాల‌ను ఢిల్లీలో ఎస్సీ క‌మిష‌న్‌కు అంద‌జేశారు.
ఆ పత్రాలను ప‌రిశీలించిన త‌ర్వాత వివ‌ర‌ణ ఇస్తామ‌ని ఎస్సీ జాతీయ క‌మిష‌న్ స‌భ్యుడు సుభాష్ రామ్‌నాథ్ పార్ది తెలిపారు. క‌మిష‌న్ అడిగిన అన్ని ద‌స్త్రాల‌ను, వాస్త‌వాల‌ను స‌మ‌ర్పించిన‌ట్లు స‌మీర్ వాంఖ‌డే తెలిపారు. త‌న ఫిర్యాదును క‌మిష‌న్ స‌మీక్షిస్తుంద‌ని, త్వ‌ర‌లోనే క‌మిష‌న్ చైర్మ‌న్ వివ‌ర‌ణ ఇస్తార‌ని స‌మీర్ చెప్పారు. స‌మీర్ అంద‌జేసిన పత్రాలను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ప‌రిశీలిస్తామ‌ని జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య్ సంపాలా తెలిపారు.

స‌మీర్ వాంఖ‌డే ముస్లిం పేరు పెట్టుకున్నాడ‌ని, అత‌ని కుల ధ్రువీకరణ స‌ర్టిఫికేట్ మాత్రం హిందువుల‌ద‌ని మంత్రి న‌వాబ్ ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై స‌మీర్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న చేశారు. త‌న తండ్రి ధ్యాన్‌దేవ్ క‌చ్రూజీ వాంఖ‌డే ద‌ళితుడ‌ని, ఎక్సైజ్ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్‌గా చేసి రిటైర‌య్యార‌ని వెల్లడించారు. తన తండ్రి హిందువు అని, త‌ల్లి జ‌హీదా ముస్లిం మ‌త‌స్తురాల‌ని స‌మీర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు.

స‌మీర్‌ తండ్రి కూడా ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ తాను ద‌ళితుడిని అని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌ను ఫాలో అవుతున్న‌ట్లు వెల్ల‌డించారు. మంత్రి న‌వాబ్ మాలిక్ త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్నట్లు ఆరోపించారు. క్రూయిజ్‌లో డ్ర‌గ్స్ పార్టీపై దాడి చేసి ఆర్య‌న్‌ను అరెస్టు చేసిన త‌ర్వాత స‌మీర్ వాంఖ‌డేపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. స‌మీర్ వాంఖ‌డే తొలుత ముస్లింని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన త‌ర్వాత మ‌ళ్లీ హిందువును వివాహం చేసుకున్నాడు.

2006లో డాక్ట‌ర్ ష‌బానా ఖురేషిని స‌మీర్ పెళ్లాడాడు. 2016లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. 2017లో క్రాంతి రేడ్క‌ర్‌ను స‌మీర్ పెళ్లి చేసుకున్నాడు. వాఖండే గత రెండేళ్లుగా బాలీవుడ్ లో పలువురు ప్రముఖులను డ్రగ్స్ కేసులకు సంబంధించి విచారించినా చెలరేగని వివాదాలను,  ఆయన సూపర్ స్టార్ గా పేరొందిన షారూఖాన్డ్ కుమారుడిని అరెస్ట్ చేయగానే తెరపైకి తీసుకు రావడం గమనార్హం.