అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో న‌వాబ్‌ మాలిక్ కు సంబంధాలు

మ‌హారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత న‌వాబ్ మాలిక్‌కు అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో ఉన్న సంబంధాల‌ను బ‌హిర్గ‌తం చేస్తాన‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. డ్ర‌గ్స్ వ్యాపారి జైదీప్ రాణాతో తాను క‌లిసిఉన్న ఫోటోల‌ను న‌వాబ్ మాలిక్ విడుద‌ల చేసిన త‌ర్వాత ఫ‌డ్న‌వీస్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 
 
త‌న‌కు రాణాతో ఎలాంటి సంబంధాలు లేవ‌ని ఫ‌డ్న‌వీస్ స్ప‌ష్టం చేశారు. రివ‌ర్ మార్చ్ అనే సంస్ధ ఆహ్వానంపై రాణా ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యాడ‌ని చెప్పారు. ఫ‌డ్న‌వీస్ భార్య అమృత 2018లో చేప‌ట్టిన రివ‌ర్ ఆంధెమ్ ప్రాజెక్టులో భాగంగా ఫ‌డ్న‌వీస్‌తో రాణా క‌లిసిఉన్న ఫోటోను న‌వాబ్ మాలిక్ ట్వీట్ చేశారు.
 
త‌న భార్య సామాజిక సేవా రంగంలో ప‌నిచేస్తోంద‌ని, త‌న‌పై దాడి చేయ‌లేని వారంతా త‌న భార్య‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తుంటార‌ని ఫ‌డ్న‌వీస్ ధ్వజమెత్తారు. అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో న‌వాబ్ మాలిక్‌కు ఉన్న సంబంధాల‌ను తాను బ‌య‌ట‌పెడ‌తాన‌ని స్పష్టం చేశారు. మాలిక్ ఆట మొద‌లెట్టాడ‌ని దివాళీ వ‌ర‌కూ ఇది ముగిసిపోతుంద‌ని పేర్కొన్నారు. తాను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడ‌న‌ని మాలిక్ బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఫ‌డ్న‌వీస్ స్ప‌ష్టం చేశారు.
 
గత కొద్దీ రోజులుగా డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సమీర్ వాఖండే ను లక్ష్యంగా చేసుకొని మాలిక్ పలు ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి – శివసేన ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో డ్రగ్స్ దందా విపరీతంగా జరిగినదని, ఆ సమయంలోనే వాఖండే ను రీజినల్ డైరెక్టర్ గా ఫడ్నవిస్ నీయమింప చేశారని కూడా ఆరోపించారు. 
 
“అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నవారు నా గురించి మాట్లాడటం మంచిది కాదు. దీపావళి వరకు ఆగండి. నేను అన్ని ఆధారాలు బైటపెడతాను” అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.