హుజూరాబాద్‌ లో గందరగోళంగా ఈవీఎంల తరలింపు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించిన ఈవీఎంలను శనివారం రాత్రి ఓ ప్రైవేటు కారులో తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఆదివారం ఆందోళనలు చేపట్టింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని డిమాండ్ చేసింది. 

ఎన్నికలో గెలవడానికి పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డ టీఆర్‌ఎస్‌.. చివరికి ఓడిపోతామని తెలిసి ఈవీఎంలను మాయం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఓటమిని గ్రహించిన కేసీఆర్‌.. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను దారిమళ్లించే కుట్రకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. 

శనివారం రాత్రి పోలింగ్‌ ముగిసిన అనంతరం 306 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను, వీవీప్యాట్లను కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలిస్తుండగా.. బస్సు టైర్‌ పంక్చర్‌ అయిందంటూ గంటపాటు రోడ్డుపై నిలిపివేశారు. 

ఈ సందర్భంగా ఓ ప్రైవేట్‌ కారులో ఈవీఎంలను, వీవీప్యాట్లను తరలించగా.. ఈవీఎంను పట్టుకొని ఒక వ్యక్తి రోడ్డుపై నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను మార్చివేశారనే అనుమానాలను బీజేపీ నేతలు వ్యక్తం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజాతీర్పును స్వీకరించకుండా ఈవీఎం, వీవీప్యాట్స్‌తో అవకతవకలకు పాల్పడేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 

విషయం తెలియగానే ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మంద నగేశ్‌ముదిరాజ్‌తో పాటు దాదాపు 100 మంది బీజేపీ శ్రేణులు కరీంనగర్‌లో ధర్నా చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాయి. జమ్మికుంట, వీణవంక లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ప్రభుత్వ అధికారులు టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌ ఆరోపించారు. ఒక బస్సు పంక్చర్‌ అయితే నాలుగు బస్సులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.

 ఉప ఎన్నిక నిర్వహణ, అధికారులు వ్యవహరించిన తీరు, ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తున్న బస్సుల్లోనుంచి కారులోకి మార్చిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్యెల్సీ రామచంద్రరావు ప్రభుతులు కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

కాగా, సీఎం కేసీఆర్‌ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని, గెలవలేక నీచమైన పనులు చేస్తున్నారని ఈటెల రాజేందర్‌ ధ్వజమెత్తారు.   దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పటికీ రాకపోవచ్చని చెబుతూ  నియోజకవర్గంలో ఆరు నెలలుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్‌, సీపీ ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. 

హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు గంటలోపు చేరుకోవాల్సిన బస్సు రాత్రి 12 గంటల వరకు కూడా చేరలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అయితే, వీవీ ప్యాట్ల మార్పుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కోరారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహించినప్పుడు పనిచేయని వాటిని మాత్రమే వాహనాల్లో మార్పు చేశారని తెలిపారు.

 వీవీ ప్యాట్లు తారుమారయ్యాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కరీంనగర్‌ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోతో సమీక్షించినట్లు పేర్కొన్నారు. పనిచేయని వీవీ ప్యాట్లను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.