అమెరికా నుండి భారత్ కు చేరిన చోరీకి గురైన కళాఖండాలు

మన దేశంలో వివిధ దేవాలయాల్లో కళాఖండాలు, విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. వాటిలో చాలా వాటిని విదేశాలకు తరలించారు. ఈ విధంగా అమెరికాకు చేరిన 248 ప్రాచీన కళాఖండాలు, విగ్రహాలను అమెరికా తిరిగి భారత్‌ కు ఇచ్చేసింది. 

వీటిలో 13 కళాకృతులు తమిళనాడులోని వివిధ దేవాలయాలకు చెందినవే. తంజావూరు, పున్నైనల్లూర్‌ గ్రామంలోని దేవాలయం నుంచి చోరీకి గురైన 10వ శతాబ్దంనాటి కాంస్య నటరాజ విగ్రహం కూడా వీటిలో ఉంది. 

న్యూయార్క్‌ నగరంలోని ఇండియన్‌ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో భారతీయ అధికారులకు ఈ కళాఖండాలను, విగ్రహాలను అమెరికా అధికారులు అప్పగించారు. దొంగతనానికి గురైన కళాకృతులు, విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు విస్తృత స్థాయి దర్యాప్తు జరిగింది.

ఈ దర్యాప్తులో పెద్ద ఎత్తున కళాఖండాలు, విగ్రహాలను గుర్తించారు. కల్నల్‌ మాథ్యూ బగ్డనోసాండ్‌ ఆధ్వర్యంలోని న్యూయార్క్‌ సిటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఆఫీస్‌ అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగానే ఈ కళాకృతులు తిరిగి స్వదేశానికి వచ్చాయి.

భారత దేశం, నేపాల్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌, కంబోడియా, పాకిస్థాన్‌, థారులాండ్‌ దేశాల నుంచి కళాకృతులను దొంగిలించి న్యూయార్క్‌ సిటీలోని ఆర్ట్స్‌ ఆఫ్‌ ది పాస్ట్‌ గ్యాలరీలో ఉంచుతున్నారు. ఈ గ్యాలరీలో అమెరికా హౌమ్‌లాండ్‌ సెక్యూరిటీ సోదాలు చేసింది. 2012 వరకు జరిగిన ఈ సోదాల్లో రూ.850 కోట్ల పైనే విలువ గల 2,622 కళాకృతులను స్వాధీనం చేసుకుంది.