అస్సాం, బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో గత కొద్ది వారాలుగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల, వైరస్ నిర్ధారణ పరీక్షల తగ్గుదల పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా లక్షణాలను పరిగణనలోకి తీసుకుని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను వెంటనే పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఈ రెండు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. 
 
అక్టోబర్ 20-26 మధ్య కేసుల పెరుగుదలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆర్తీ అహుజ అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఈ నెల 26న ఒక లేఖ రాస్తూ గడచిన నాలుగు వారాలుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అస్పాంలో గడచిన నాలుగు వారాలతో పోలిస్తే కేవలం గత వారంలోనే కరోనా కొత్త కేసుల సంఖ్య 41 శాతం పెరిగిందని ఆహుజ తెలిపారు.
 
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు వారం రోజుల్లో 1,64,071 టెస్టులు నిర్వహించగా అక్టోబర్ 19-25 మధ్య కేవలం 1,27,048 పరీక్షలు మాత్రమే నిర్వహించారని తెలిపారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్టా ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 446 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42కోట్లకు పైగా చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,58,186మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా, గత 24 గంటల్లో  14,667మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,36కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 106 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.