కొద్ది రోజుల్లో కరోనా మూడో వేవ్

దేశంలో మరికొద్ది రోజుల్లో కరోనా మూడో వేవ్ రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వెలుగుచూస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎవై.4.2 కేసులు కారణంగా మన దేశంలో మూడో ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త వేరియంట్ కేసులు నమోదు భయాందోళనలు కలిగిస్తోంది. 

ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయినప్పటికి కరోనా  ముగిసిపోలేదని.. మూడో వేవ్ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో నమోదైన కరోనా  కొత్త వేరియంట్ ఎవై.4.2 ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్  రెండో  వేవ్ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్ వేరియంట్ కుటుంబానికి చెందినది అని, దీని వల్ల కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఎపి, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు. ఈ కొత్త వేరియంట్‌ను డెల్టా ప్లస్‌గా పిలుస్తున్నారు. బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవలే దీనిని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్‌గా పేర్కొన్నది. 

అయితే ఎవై 4.2 వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని కొత్త ఉప వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ఏవై రకం దారితీస్తుందా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవును అని ఇప్పుడే అనడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది.