రుణాల ఒప్పందంపై గవర్నర్ పేరుపై దిద్దుబాటు చర్యలు 

రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌డిసి) ద్వారా తీసుకుంటున్న భారీ రుణాల ఒప్పందంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ పేరును హమీదారునిగా చేర్చడంపై వివాదం తలెత్తడంతో ఆయన పేరును తొలగించాలని ఎపి  ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 

గవర్నర్‌ పేరు చేర్చడం వివాదాస్పదం కావడంతో పాటు, హైకోర్టు కూడా వివరణ కోరడంతో ఈ విషయంలో దిద్దుబాటు చర్యలను ఆర్థికశాఖ ప్రారంభించింది. గవర్నర్‌ పేషీ అధికారులు కూడా ఆర్థికశాఖతో పలుమార్లు చర్చించారు. ఈ నేపథ్యంలో ఒప్పంద పత్రంలో గవర్నర్‌ పేరు తొలగించి, ఆర్థికశాఖ అధికారి పేరును కొనసాగించడానికి కసరత్తు ప్రారంభమైంది. 

ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ద్వారా వివరించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ గవర్నర్‌ తరపున జరిగే విషయం తెలిసిందే. అయితే, రుణ ఒప్పందపత్రంపై గ్యారంటీ ఇచ్చే వ్యక్తి పేరు, చిరునామా స్థానంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ అని పూర్తి పేరు పేర్కొనడం, కేరాఫ్‌ అడ్రస్‌గా ముఖ్య కార్యదర్శి, ఆర్ధికశాఖ, సచివాలం, వెలగపూడి అని రాయడం విమర్శలకు తావిచ్చింది.

అదే సమయంలో గవర్నర్‌ తరపున ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి మల్లేశ్వరరావు ఒప్పంద పత్రం పై సంతకాలు చేశారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు గవర్నర్‌ పేరును ఎలా రాస్తారని ప్రశ్నించింది. రుణాలు ఇచ్చిన వారు గవర్నర్ కు నోటీసులు పంపాలని అనుకొంటున్నారా అంటూ కూడా నిలదీసింది. 

తాజా పరిణామాల నేపథ్యంలో ఒప్పంద పత్రాన్ని తిరగి రాయాల్సి ఉందని ఒక సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే, దీనికి బ్యాంకర్లు అంగీకరించాల్సి ఉండటంతో ఆర్థికశాఖ అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నట్లు తెలిసింది.