ఏపీలో రెండు గంటలపాటు మాత్రమే టపాకాయలు!

ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు పేరుతో  ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది. దీపావళి పర్వదినాన రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అది కూడా గ్రీన్‌ క్రాకర్స్‌‌ మాత్రమే కాల్చి పండుగ జరుపుకోవాలని తెలిపింది. శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ఏకే పరీడా చెప్పారు. మరోవైపు, కరోనా మూడో వేవ్‌ హెచ్చరికలు కూడా ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు.

కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని ప్రభుత్వం సూచించింది. 

రసాయనాలు ఎక్కువగా ఉండే టపాసులు కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతున్నందున, వాటికి బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నది. దీపావళి రోజు వాడే ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచాపై తాము పూర్తి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.

కేవలం బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే టపాకాయలు కాల్చే సమయంపై అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి ఆంక్షలు విధించక పోవడం గమనార్హం.