డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి `గిరిజన’ కాదంటూ మరో కేసు

రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరో కుల వివాదం కేసులో కోర్టులో పిటిషన్ నమోదయింది. పుష్పశ్రీవాణి గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాదంటూ ఏపీ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.
 
విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పుష్పశ్రీవాణి వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి ప్రమాణం స్వీకారం చేసారు. అయితే పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ గత కొంత కాలంగా వివాదం నడుస్తో్ంది. 
 
పుష్పశ్రీవాణి సోదరి రామ తులసిని ఎస్టీ కాదని పేర్కొంటూ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం నుంచి గతంలో తొలగించారు. దీంతో పుష్పశ్రీవాణి కూడా ఎస్టీ కాదని పలువురు కోర్డుకు ఎక్కారు. అయితే తన సోదరిని కులం కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించలేదని, నాన్ లోకల్ కారణంగానే ఉద్యోగం నుంచి రామ తులసిని తొలగించారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. అంతేకాకుండా తాము నిజమైన ఎస్టీలమేనని పుష్పశ్రీవాణి వాదిస్తున్నారు.
 
ఆమె వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేరిన కొత్తలోనే ఆమెకు జారీ చేసిన కుల సర్టిఫికెట్ నకిలీదని సీనియర్ బీజేపీ గిరిజన నాయకుడు నిమ్మక జయరాజ్ ఆరోపించారు. ఆమెకు, ఆమె కుటుంభం సభ్యులకు జారీచేసిన కుల సర్టిఫికెట్ ల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. 
 
1960 నాటి ఆమె తండ్రి పాఠశాల సర్టిఫికెట్ లో కేవలం `కొండా’ కులంగా పేర్కొన్నారని, షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఆ కులం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్ డి ఓ  లేదా సబ్ కలెక్టర్ మాత్రమే కుల సర్టిఫికెట్ జారీచేయడానికి అర్హులని 1995లో సుప్రీం కోర్ట్ స్పష్టం చేస్తుండగా, 2014లో ఒక తహశీల్ధార్ ఆమెకు అటువంటి సర్టిఫికెట్ ను ఏవిధంగా జారీ చేస్తారని ప్రశ్నించారు. 
 
ఇలా ఉండగా, పుష్ప శ్రీవాణి గిరిజనురాలు కాదంటూ గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోర్టు డీఎల్ఆర్ సీ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ పుష్ప శ్రీవాణి గిరిజనురాలేనని గత మే లో స్పష్టం చేసింది.