రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు చేప‌ట్ట‌నున్న మ‌హా పాద‌యాత్ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం నినాదంతో చేపట్టదలచిన మహా పాదయాత్రకు ఆంధప్రదేశ్ హైకోర్టు అనుమతినిచ్చింది. 

 అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రను చేపట్టారు.  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు, కూలీలు సిద్ధమవుతున్నారు. 

నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రాజధాని రైతులు పాద‌యాత్ర చేసేందుకు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున వాటిని ఉద్యమ నిర్వాహకులు అమలు చేయలేరని, మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిథిలో ఉండడంతో దాని మీద ఆందోళనకు అనుమతించడం వీలుకాదని చెబుతూ పొలీసులు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు.

ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు.పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. దీనితో పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 

 రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు వెల్లడించారు. అనంతరం షరతులతో పాదయాత్రకు అనుమతినిచ్చింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన  రాజకీయ భవిష్యత్ కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర  చేశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు “న్యాయస్థానం నుండి దేవస్థానం” పాదయాత్ర చేస్తూంటే  అడ్డుకోవడం అంటే జగన్ తనని తాను అవమానించుకోవడమే అని బిజెపి నేత లంకా దినకర్ ధ్వజమెత్తారు. 
 
జగన్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి.. నేడు అదే  పాదయాత్ర చేసే రైతులకు పోలీసుల రక్షణ ఇవ్వాల్సింది పోయి రాళ్ళ దాడి జరగొచ్చు అనే ప్రభుత్వం రాష్ట్రంలో పాలనచేసే నైతిక హక్కు కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు శాంతి భద్రతలు కాపడడానికే కాని రాళ్ల దాడి కుట్రలు చేసేవారి కోసం కాదని హితవు చెప్పారు. న్యాయ స్థానం అనుమతితో జరుగనున్న పాదయాత్రకు ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అనిదినకర్ స్పష్టం చేశారు.