ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్

ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.  విజయవాడ లోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెతో గవర్నరు  సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారుఇప్పటి వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో జస్టిస్‌ లీసా గిల్‌ నూతన సిజెగా నియమితులయ్యారు. 

జస్టిస్‌ లీసా గిల్‌ నవంబరు 17, 1966న చండీగఢ్‌లో జన్మించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హర్పూల్‌ సింగ్‌ బ్రార్‌ కుమార్తె ఆమె. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి బిఎ-ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పంజాబ్‌-హర్యానా హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దాదాపు పాతికేళ్లపాటు ప్రాక్టీస్‌ చేశారు. 

సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ కేసుల్లో మంచి పేరు సంపాధించారు. చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతానికి చాలాకాలం పాటు ప్రభుత్వ న్యాయవాదిగా, పలు సంస్థలు, కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2014 మార్చి 31న పంజాబ్‌-హర్యానా హైకోర్టు అదనపు న్యాయవ¶ర్తిగా నియమితులయ్యారు. తర్వాత శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.  సుప్రీంకోర్టు కొలీజియం ముందుగానే ఆమెను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూనే నూతన సిజె కానున్నారని ప్రకటించింది.

అడ్వాన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీలో భాగంగా గత మార్చిలోనే రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు. 2028 నవంబరు 16 వరకూ ఆమె హైకోర్టు సిజెగా కొనసాగుతారు. ఆమె ఎన్నో సంచలన తీర్పులను వెలువరించారు.  ఇదిలా ఉండగా, ప్రమాణ స్వీకారానికి ముందే ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమై పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, ఇప్పటి వరకు సిజెగా పనిచేసిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌కు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. నూతన సిజె జస్టిస్‌ లీసా గిల్‌ ప్రసంగిస్తూ, కోర్టుల్లో మౌలిక వసతుల కోసం జస్టిస్‌ ఠాకూర్‌ కృషి చేశారని కొనియాడారు. జడ్జిల నివాస సముదాయాలు, కోర్టు భవనాల నిర్మాణాలు కూడా ఆయన హయాంలో ప్రారంభమయ్యాయని, జ్యుడీషియల్‌ అకాడమీకి కూడా శంకుస్థాపన జరిగిందని చెప్పారు.

చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ భావోద్వేగంతో ప్రసంగిస్తూ సత్వర న్యాయం అందించాల్సి వుందని తెలిపారు. జస్టిస్‌ సిటీ ప్రతిపాదన కార్యరూపంలో పెట్టే ప్రయత్నం జరిగిందని చెప్పారు. అనంతరం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను సన్మానించారు.