రేషన్ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ నిధి

వ్యవసాయ రంగంలో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్)పథకంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి ఈ పధకం కింద కేంద్ర నుంచి సాయం పొందగోరే రైతులు రేషన్ కార్డు తప్పని సరిగా జతచేయాల్సివుంటుంది. 

కొత్త నిబంధనల ప్రకారం పొలం ఉన్న రైతులు కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి. రేషన్‌కార్డు నెంబర్ ను దరఖాస్తులో తెలియపరుస్తూ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేయాలి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నరేంద్ర మోదీ  ప్రభుత్వం ప్రతి ఏటా వ్యవసాయంలో పంటల సాగు పెట్టుబడి కోసం 6వేల రూపాలు ఈ పధకం కింద చేరిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూంది. 

ఈ మొత్తాన్ని రెండేసి వేల రూపాయల చొప్పున ఏటా మూడు విడుతలుగా రైతు ఖాతాకు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 నుంచి దేశమంతటా అమల్లోకి తెచ్చింది. ఈ పధకం ప్రారభంమయ్యాక 10వ విడతగా నిధులను డిసెంబర్ 15న రైతుల ఖాతాలకు జమ చేయనుంది. కొత్తగా ఈ పథకంలో చేరి ప్రయోజనం పొందాలనుకునే రైతులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సివుంది.

రైతులు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. పట్టాదారు పాస్‌పుస్తకం రైతు పేరుతో కలిగి ఉండాలి. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నధి యోజన పథకం కింద 2021-22 సంవత్సరానికి సంబంధించి మొత్తం 39.32లక్షల మంది రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం 36.42లక్షల మంది రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పన ఇటీవల మొత్తం రూ 640 కోట్లు జమ చేశారు. బ్యాంకు ఖాతాలకు మొబల్ నంబర్ జత చేసుకున్న రైతులు తమ సెల్‌పోన్లో పిఎం కిసాన్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే రైతుకు నేరుగా ఈ పథకం కింద నిధుల జమ వివరాలు అప్పటికప్పుడే తెలుసుకునే వీలుంది.

అన్ని అర్హతలు ఉండి తగిన ఆధారాలతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఉండి నిధలు జమ కాని వారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన వివరాలు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.