మరో రూ 100 పెరగనున్న వంటగ్యాస్ సిలిండర్ 

14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర దీపావళి నాటికి మరో  రూ.100 పెంచే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత.. ధరను ఎంతమేరకు పెంచాలన్న దానిపై నిర్ణయిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి. సిలిండర్‌ ధరను ఇంత మొత్తంలో పెంచడానికి గల కారణాలను ఆయిల్‌ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

గ్యాస్‌ ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో రిటైల్‌ సిలిండర్‌ ధరను పెంచేందుకు ఆయిల్‌ కంపెనీలను అనుమతించడం లేదు. దీంతో గ్యాస్‌ కొనుగోలు-అమ్మకం ధరల్లో అంతరం ఏర్పడింది. దీన్ని పూడ్చేందుకు అవసరమైన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇది చాలదన్నట్టు అంతర్జాతీయ విపణిలో గ్యాస్‌ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి.

దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఒక్కో సిలిండర్‌పై రూ.100 పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. ‘ఎల్పీజీ అనేది ఇంకా నియంత్రిత వస్తువే. ప్రభుత్వం రిటైల్‌ సిలిండర్‌ ధరను క్రమబద్దీకరించవచ్చు కూడా. దీనికోసం ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లించాలి. అప్పుడే, తక్కువ రేటుకు ఎల్పీజీ సిలిండర్‌ను విక్రయించగలం’ అని ఒక అధికారి తెలిపారు. 

‘అసలు ధర, రిటైల్‌ ధర మధ్య ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు అవసరమైన పరిహారం లేదా సబ్సిడీని ఇస్తామన్న హామీ.. ప్రభుత్వం నుంచి ఇంకా రాలేద’ని పేర్కొన్నారు. సిలిండర్‌పై సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోతే, కచ్చితంగా రిటైల్‌ సిలిండర్‌ ధరలను పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. 

గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను నాలుగుసార్లు పెంచారు. జూలైలో ఒక్కో సిలిండర్‌పై రూ.25.50, ఆగస్టు 17న రూ.25, సెప్టెంబర్‌ 1న రూ. 25, అక్టోబర్‌ 6న రూ.15 పెంచారు. స్థూలంగా గడిచిన జూలై నుంచి సిలిండర్‌పై ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.90 పెంచింది. 

ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.952కు చేరింది. ఎల్పీజీపై సబ్సిడీని ఎత్తేస్తూ గతేడాది కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్‌ ధరలు ఒకేలా ఉంటున్నాయి. గత ఏడేండ్ల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలో పెరుగుదల  రూ.538.