ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ముంబై హైకోర్టులో  బెయిల్ మంజూరు అయింది. మూడు రోజులుగా ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మొత్తానికి గురువారం ఆర్యన్ ఖాన్‌కు, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ నితిన్ సంబ్రే తీర్పునిచ్చారు. అయితే బెయిల్ మంజూరు చేస్తూ జారీచేసిన ఉత్తరువుల పత్రం రేపటికి కానీ అందుబాటులోకి రాదు. అందుచేత బెయిల్ లభించినా ఈ రాత్రికి ఆర్యన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం లేదు. 

డ్రగ్స్ కేసులో అక్టోబర్ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ను  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే గడిపారు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సి రావడంపై బాలీవుడ్‌లోనూ, అటు అధికార, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అదే సమయంలో ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై అసహనంతో పలు ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. 

వాస్తవానికి ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవగానే మొదట మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల మేజిస్ట్రేట్ కోర్టు ఆ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వడం అనేది మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో లేనందువల్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ఆ సమయంలో రద్దయింది.

ఆ తర్వాత సెప్టెంబర్ 13, 14వ తారీఖుల్లో ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రత్యేక కోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. రెండ్రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 20వ తారీఖున తీర్పును వెల్లడింది. బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో ఆ మరుసటి రోజే ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ దాఖలు అయింది. ఈ బెయిల్ పిటిషన్‌పై మంగళ, బుధ వారాల్లో నిందితుల తరపున వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, అర్బాజ్ మర్చంట్ తరపున అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు.

తమ క్లయింట్ ఒక అతిథిగానే వెళ్లాడనీ.. అతడి వద్ద ఏమీ దొరకలేదని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. తమ క్లయింట్లను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంత చిన్న కేసులో అవసరం లేకున్నా వారిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. నేరం రుజువు అయితే కేవలం ఏడాది శిక్ష పడే కేసు విషయంలోనే తాము బెయిల్‌ను అడుగుతున్నామని వివరించారు.

ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమో గుర్తించాలని కోరారు. తాజాగా గురువారం ఈ కేసులో ఎన్సీబీ తరపున అడిషినల్ సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ‘ఆర్యన్ ఖాన్ వద్ద మాదకద్రవ్యాలు ఏమీ దొరకలేదని అంటున్నారు. నిజమే కానీ అతడు ఈ కేసులో కీలక వ్యక్తి. అతడు నిన్న మొన్న కాదు కొన్నేళ్ల నుంచి మాదకద్రవ్యాలు స్వీకరిస్తున్న వ్యక్తి. అతడి వాట్సప్ చాటింగ్‌లో అంతర్జాతీయ డ్రగ్ డీలర్స్‌ నెంబర్స్ ఉన్నాయి. వాళ్లతో చాటింగ్స్ ఉన్నాయి’  అని గుర్తు చేశారు.

పైగా, `ఆర్యన్ ఖాన్ మద్యవర్తిగా ఉండి చాలా మంది ప్రముఖులకు డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. స్నేహితుడి వద్ద డ్రగ్స్ ఉన్నాయని ఆర్యన్ ఖాన్‌కు ముందే తెలుసు. అవి అందరూ వాడటానికి తీసుకొచ్చుకున్నవే తప్పితే ఒక్కరి కోసం కాదు’ అని కూడా తెలిపారు.

ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కలిసి పెరిగారు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేస్తారు. వారి సోషల్ మీడియా ఖాతాలు చూస్తేనే అది అందరికీ అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉంటారని వివరించారు. తాము డ్రగ్స్ తీసుకున్నామా..? లేదా అన్నది పరీక్షించలేదని నిందితులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం అది కాదు. వాళ్లు ఈ ప్రొఫెషన్‌‌లో ఉన్నారా..? లేదా..? అన్నదే ముఖ్యం. మొదటి నిందితుడు అయిన ఆర్యన్ ఖాన్‌కు అక్కడ డ్రగ్స్ పార్టీ జరగబోతోందని ముందే తెలుసని స్పష్టం చేశారు.

`ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోనప్పటికీ, అతడి వద్ద డ్రగ్స్ దొరకనప్పటికీ ఆ వ్యవహారాల్లో అతడే కీలకంగా వ్యవహరించాడు. తదుపరి విచారణకు అతడు ఎంతో కీలకం..’ అని ఎన్సీబీ తరపున లాయర్ వాదనలు వినిపించారు. మొత్తానికి ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆర్యన్ ఖాన్‌కు, అర్బాన్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.