సమీర్ వాంఖడేకు బాసటగా ఎన్సీబీ

క్రూయిజ్​ షిప్​లో డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ అధికారి​ సమీర్​ వాంఖడేకు బాసటగా ఎన్సీబీ నిలబడింది.  ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తూనే.. వాంఖడేకు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు దొరికేంత వరకూ కేసు విచారణకు ఇన్​చార్జిగా కొనసాగిస్తామని డిప్యూటీ డైరెక్టర్​ జనరల్(డీడీజీ) జ్ఞానేశ్వర్​ సింగ్​ తేల్చి చెప్పారు. 
 
లంచం డిమాండ్​ చేశారన్న ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ కమిటీ వాంఖడేను బుధవారం దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించిందని వివరించారు. ఆర్యన్​ కేసుకు సంబంధించిన వివరాలన్నీ వాంఖడే అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. డిపార్ట్​మెంట్​చేపట్టిన ఈ విచారణ కొనసాగుతుందని అవసరమైతే వాంఖడేను మరోసారి ప్రశ్నిస్తామని చెప్పారు. 
 
ఇప్పటికే ఐదుగురు సభ్యుల టీమ్ ముంబై వెళ్లిందని, ఎన్సీబీ ఆఫీసు నుంచి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుందని తెలిపారు. వాంఖడే స్టేట్ మెంట్​తో పాటు సాక్షులందరి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేస్తామని వివరించారు. డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే సహా మరికొంత మంది రూ.25 కోట్ల లంచం అడిగారని సాక్షి ప్రభాకర్ సెయిల్ ఆరోపించి కలకలం సృష్టించారు.
 
ముంబై క్రూజ్ డ్ర‌గ్స్ ఈ కేసులో సాక్ష్యంగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ ఓ బాంబు పేల్చిన విష‌యం తెలిసిందే. ఆర్యన్‌ ఖాన్‌ ప్రశ్నించేందుకు వచ్చిన ప్రైవేటు దర్యాప్తుదారుడు కిరణ్‌ గోసవి.. ఈ కేసుని పరిష్కరించేందుకు షారూఖ్‌ మేనేజర్‌తో రూ. 25 కోట్లు బేరం కుదుర్చుకోవాలని భావించినట్లు చెప్పారు.
 
ఇలా ఉండగా, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) సాక్షిగా ఉన్న కిర‌ణ్ గోస‌విని పుణె పోలీసులు అరెస్టు చేశారు. 2018లో చీటింగ్ కేసులో కిర‌ణ్ అరెస్టు అయ్యాడు. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న ప‌రారీలో ఉన్నాడు.
 2019లో కిర‌ణ్ గోస‌విని పుణె పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఇటీవలే ఆర్య‌న్ ఖాన్‌తో కిర‌ణ్ గోస‌వి ఉన్న ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. దీంతో చీటింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గోస‌విపై అక్టోబ‌ర్ 14న పుణె పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి కిర‌ణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.